భోగాపురం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ గుర్తింపు
- కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల..
- ప్రారంభం నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రభ, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం జరుగుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం కీలక గుర్తింపు ఇచ్చింది. ఈ విమానాశ్రయాన్ని ‘ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్–2025’ పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర హోంశాఖ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో విమానాశ్రయం ప్రారంభమైన తొలి రోజు నుంచే అంతర్జాతీయ ప్రయాణికులకు ఇమిగ్రేషన్ సేవలు అందించే మార్గం సుగమమైంది.
కేంద్ర హోంశాఖ నిర్ణయంతో భోగాపురం విమానాశ్రయం దేశంలోని కేటగిరీ–1 అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో 39వ విమానాశ్రయంగా చోటు దక్కించుకుంది. ఈ గుర్తింపుతో విదేశాల నుంచి నేరుగా విమానాల రాకపోకలు నిర్వహించేందుకు అవసరమైన ఇమిగ్రేషన్, విదేశీయుల ప్రవేశ–నిష్క్రమణ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలవనుంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రయాణికులు విదేశీ గమ్యస్థానాలకు నేరుగా ప్రయాణించే అవకాశం కలుగుతుంది. అలాగే విదేశీ పెట్టుబడులు, ఐటీ, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు కూడా ఈ నిర్ణయం ఊతమివ్వనుంది.
ప్రపంచ స్థాయి సదుపాయాలతో నిర్మితమవుతున్న భోగాపురం విమానాశ్రయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ అనుసంధానం పెరగడంతో ఉత్తరాంధ్రలో వాణిజ్య, పారిశ్రామిక, సేవారంగాల విస్తరణకు మరింత అవకాశాలు ఏర్పడనున్నాయి.
