అక్రమంగా పశువుల తరలింపు..
- వాహనం పట్టివేత, 9 పశువులు స్వాధీనం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పరిధిలో అక్రమంగా పశువులను తరలిస్తున్న ఒక వాహనాన్ని సోమవారం పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ సీతారాం రెడ్డిలు పెట్రో మొబైల్-1 వాహనంలో విధుల్లో ఉన్నారు. ఈ క్రమంలో వలిగొండ రోడ్డు మార్గంలో అక్రమంగా పశువులను తరలిస్తున్నారనే నమ్మదగిన సమాచారం రావడంతో పోలీసులు అక్కడ వాహనాల తనిఖీలు చేపట్టారు.
అనుమానాస్పదంగా వచ్చిన టాటా ఇన్ఫ్రా వీ-30 వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో ఎలాంటి అనుమతులు లేకుండా క్రూరంగా తరలిస్తున్న 9 పశువులు (4 ఎద్దులు, 5 ఆవులు) లభ్యమయ్యాయి.
వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్‌ను సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్‌కు చెందిన షేక్ యాకూబ్ (32) గుర్తించారు. నిందితుడిని విచారించగా.. ఈ పశువులను కోదాడ సంతలో కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అంగీకరించాడు. పట్టుబడిన 9 పశువులను జఫర్ గూడలోని ‘గో మహాక్షేత్రం’ గోశాలకు సురక్షితంగా తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
