మహిళా నాయకత్వానికి లోకేష్‌కు స్పష్టమైన దూరదృష్టి

33 శాతం రిజర్వేషన్ల నేపథ్యంలో మహిళా సాధికారతపై విస్తృత చర్చ
మహిళలను అవమానించే సోషల్ మీడియా పోస్టులపై కఠిన చర్యలకు లోకేష్ సిద్ధం..
సొంత పార్టీ వారైనా ఉపేక్షించబోమన్న వైఖరి అభినందనీయం..
మహిళల గౌరవ పరిరక్షణలో రాష్ట్రానికి కొత్త దిశ లభిస్తుంది

మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ

ఎన్టీఆర్, ఆంధ్రప్రభ : మహిళల నాయకత్వ అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్‌కు స్పష్టమైన దూరదృష్టి, కార్యాచరణ ఉందని ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. సోమవారం నారా లోకేష్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి, చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలు నేపథ్యంలో మహిళా నాయకత్వ వికాసం, సమాజం నుంచి మహిళలకు లభించాల్సిన మద్దతు, మహిళా సాధికారత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం లోకేష్ చూపుతున్న తపనతో పాటు, మహిళల గౌరవాన్ని కించపరిచే సోషల్ మీడియా పోస్టుల విషయంలో సొంత పార్టీ వారినైనా ఉపేక్షించకుండా కట్టడి చేయాలనే ఆయన కృతనిశ్చయాన్ని అభినందించారు. మాటల్లో, చేతల్లో, సైగల్లో మహిళలను అవమానించే ఏ చర్యనైనా సహించబోమని రాష్ట్ర నాయకుడిగా నారా లోకేష్ ఇచ్చిన పిలుపు మహిళల సామాజిక స్థితిగతుల్లో సానుకూల మార్పుకు దోహదపడుతుందని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.