ఎరువులు అక్రమ రవాణా, కొరత, వదంతులు సృష్టించినా కఠిన చర్యలు
జిల్లాలో సమృద్ధిగా యూరియా, ఇతర ఎరువులు
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా పారదర్శకంగా ఎరువుల పంపిణీ
అవసరానికి మించి ఎరువుల వినియోగం వద్దు..
అంతర పంటలు, పంట మార్పిడి విధానాలను రైతులు అవలంబించాలి
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాలో యూరియా సహా అన్ని రకాల రసాయన ఎరువులు, పురుగుమందులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ స్పష్టం చేశారు. జిల్లాలో ఎరువుల కొరత ఉందంటూ ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టించడం, అక్రమ రవాణాకు పాల్పడడం లేదా కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సోమవారం విజయవాడ కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ జిల్లాలో ఎరువుల లభ్యత, పంపిణీ విధానం, రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా రైతులకు అవసరమైన ఎరువులను పూర్తిగా పారదర్శకంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు తన భూమి విస్తీర్ణానికి అనుగుణంగా ఆన్‌లైన్‌లో నమోదైన వివరాల ఆధారంగా అవసరమైన మేరకు మాత్రమే ఎరువులు కేటాయించడం జరుగుతుందని చెప్పారు.
మూడు విడతలకు అవసరమైన ఎరువులను ఒకేసారి కాకుండా, పంటల దశలను బట్టి విడతల వారీగా రైతులు పొందే అవకాశం హక్కుగా కల్పించామని పేర్కొన్నారు. కేటాయించిన ఎరువులు ఆయా రైతుల పేర్లతోనే నమోదు చేయబడతాయని, అందువల్ల ఎలాంటి కొరత లేదా పంపిణీ సమస్యలు తలెత్తవని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 17,425 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జూన్ 8 నుంచి ఏపీఏఐఎంఎస్ యాప్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 22,616 మంది రైతులు 3,888 మెట్రిక్ టన్నుల ఎరువులను కొనుగోలు చేశారని వెల్లడించారు. సొంత భూములు కలిగిన రైతులతో పాటు కౌలు రైతులు, పోడు భూములు సాగు చేస్తున్న రైతులు, ఇతర అర్హులైన సాగుదారులకు కూడా ఎరువులు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఎరువుల విక్రయంలో ధరలు, నాణ్యత లేదా పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరిగినా సంబంధిత డీలర్లపై లైసెన్స్ రద్దు సహా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే జిల్లాలోని ప్రతి ఎరువుల విక్రయ కేంద్రంలో రైతుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లను ప్రదర్శించడం జరిగిందని, సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక సేవలను రైతులకు మరింత చేరువ చేయడానికి కలెక్టరేట్ స్థాయిలో ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు లేదా ప్రజలు వ్యవసాయ పద్ధతులు, పంటల నిర్వహణ, ఎరువుల పంపిణీ, సాంకేతిక సమాచారం లేదా ఇతర వ్యవసాయ సంబంధిత వివరాల కోసం 91549 70454 నంబర్‌కు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ఈ నంబర్ ద్వారా అవసరమైన సమాచారం, సాంకేతిక సూచనలు, వ్యవసాయ సలహాలు అందించబడతాయని తెలిపారు. అధిక మోతాదులో రసాయన ఎరువుల వినియోగం వల్ల నేల సారవంతం తగ్గడమే కాకుండా పర్యావరణం, మానవ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అందువల్ల శాస్త్రీయ సూచనల మేరకు మాత్రమే ఎరువులు వినియోగించాలని, అవసరానికి మించి వినియోగించరాదని రైతులకు సూచించారు. వ్యవసాయంలో స్థిరమైన ఉత్పాదకత సాధించాలంటే రైతులు అంతర పంటల సాగు, పంట మార్పిడి విధానాలు తప్పనిసరిగా అవలంబించాలని కలెక్టర్ సూచించారు.
ఈ విధానాల ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఉత్పత్తి వ్యయం తగ్గి, రైతులకు దీర్ఘకాలికంగా లాభాలు చేకూరుతాయని తెలిపారు. జిల్లాలో ఎరువుల సరఫరాపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని, రైతులకు అవసరమైన ప్రతి మెట్రిక్ టన్ను ఎరువు సమయానికి అందేలా అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డిఎంఎఫ్ విజయ కుమారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పి.బాలాజీ కుమార్ పాల్గొన్నారు.
