ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండడమే లక్ష్యం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ (ఆంధ్రప్రభ): ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఏడాది రెండుసార్లు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇటీవల పోలియో చుక్కల కార్యక్రమంతో పాటు 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ టీకాలు కూడా అందించామని చెప్పారు. గురుకుల పాఠశాలల్లో డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచి, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో వేములవాడ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరగతులు ప్రారంభమవుతాయని, హైదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు, పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
