Durga-Temple-No1 : దుర్గగుడిదే నెంబర్ వన్..! Andhra Prabha Top Story

Durga-Temple-No1 : దుర్గగుడిదే నెంబర్ వన్..! Andhra Prabha Top Story

  • భక్తుల సంతృప్తిలో అగ్రస్థానం
  • 74% భక్తుల సానుకూల స్పందన..
  • దుర్గగుడికి మరో అరుదైన గుర్తింపు
  • ఐవీఆర్ఎస్ సర్వేలో దుర్గగుడి సత్తా.. రాష్ట్రంలో ఏకైక వృద్ధి నమోదు
  • పరిశుభ్రత, ప్రసాదాలు, సేవలు.. దుర్గగుడికి భక్తుల ప్రశంసల జల్లు
  • దేవాదాయ శాఖ సర్వేలో దుర్గగుడి టాప్..
  • ఇతర ఆలయాలకు మించి పనితీరు
  • ఐవిఆర్ఎస్ లో దుర్గ గుడి దేవస్థానానికి విశేష గుర్తింపు

( ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ)

విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం భక్తులకు అందిస్తున్న సేవల్లో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జూలై-2026 భక్తుల సంతృప్తి (ఫీడ్‌బ్యాక్) సర్వేలో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో సానుకూల స్పందన పెరిగిన ఏకైక దేవస్థానంగా విజయవాడ దుర్గగుడి నిలిచింది. జూన్ నెలలో నమోదైన 71.2 శాతం సానుకూల స్పందన జూలైలో 74 శాతానికి చేరుకుని 2.9 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Durga-Temple-No1 : మెరుగైన సౌకర్యాలతో…

దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలు, సేవల నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి వసతి, ప్రసాదాల నాణ్యత వంటి అంశాలపై భక్తుల అభిప్రాయాలను సేకరించి దేవాదాయ శాఖ ఈ సర్వేను నిర్వహించింది. జూలై నెల నివేదికలో విజయవాడ దుర్గగుడి దేవస్థానం పనితీరు మరింత మెరుగుపడినట్లు వెల్లడైంది.

Durga-Temple-No1 : సేవలపై మెరుగైన సంతృప్తి..

జూలై నెల లో నిర్వహించిన ఫీడ్‌బ్యాక్‌లో దేవాలయ దర్శనం సంతృప్తికరంగా జరిగిందా? అనే ప్రశ్నకు 73.5 శాతం మంది భక్తులు సానుకూలంగా స్పందించారు. దేవాలయంలో తాగునీటి వసతులు బాగున్నాయా? అనే ప్రశ్నకు 67.3 శాతం మంది సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. దేవాలయంలో ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా? అనే ప్రశ్నకు 75.9 శాతం మంది సానుకూల స్పందన తెలిపారు. దేవాలయంలో పరిశుభ్రత సంతృప్తికరంగా ఉందా? అనే అంశంపై 66.6 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Durga-Temple-No1 : నెంబర్ వన్ లో దుర్గగుడి….

దేవాదాయ శాఖ సమగ్ర పనితీరు అంచనాలో విజయవాడ దేవస్థానం ఓవరాల్ స్కోర్ 70.7 శాతం సంతృప్తిస్తాయి సాధించింది. జూన్ నెలలో ఇదే స్కోర్ 72.5 శాతంగా నమోదైనప్పటికీ, ప్రధాన దేవాలయాల మధ్య జరిగిన పోలికలో భక్తుల సానుకూల స్పందన పెరిగిన ఆలయంగా విజయవాడ ప్రత్యేక గుర్తింపు పొందింది.

Durga-Temple-No1 : జేసీఈవో పరిధిలోనూ మెరుగైన పనితీరు…

జేసీఈవో (JCEO) పరిధిలో నిర్వహించిన ప్రత్యేక సర్వేలో కూడా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం మంచి ఫలితాలు నమోదు చేసింది. దర్శనంపై సంతృప్తి 73.4 శాతం, తాగునీటి వసతులపై 67 శాతం, ప్రసాదాల నాణ్యతపై 75.7 శాతం, పరిశుభ్రతపై 66.2 శాతం సానుకూల స్పందన లభించింది. ఈ విభాగంలో దేవస్థానం మొత్తం పనితీరు స్కోర్ 70.5 శాతంగా నమోదైంది.

Durga-Temple-No1 : ఇతర దేవాలయాల కంటే ముందంజ లో…

రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల జూలై పనితీరు పోలికలో విజయవాడ దేవస్థానం మాత్రమే వృద్ధిని నమోదు చేసింది. జూన్‌లో 71.2 శాతంగా ఉన్న సానుకూల స్పందన జూలైలో 74 శాతానికి చేరి 2.9 శాతం పెరుగుదల సాధించింది. మిగిలిన ప్రధాన దేవాలయాలన్నింటిలో సానుకూల స్పందన తగ్గింది. శ్రీశైలం 68.8 నుంచి 68.0 శాతానికి, ద్వారకా తిరుమల 74.2 నుంచి 72.4 శాతానికి, కాణిపాకం 72.0 నుంచి 69.9 శాతానికి, సింహాచలం 72.6 నుంచి 69.7 శాతానికి, అన్నవరం 73.0 నుంచి 69.9 శాతానికి, శ్రీకాళహస్తి 75.8 నుంచి 69.4 శాతానికి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది.

Durga-Temple-No1 : సేవల మెరుగుదలకు చర్యలే ఫలితం..

ఇంద్రకీలాద్రి దుర్గ గుడి దేవస్థానంలో ఇటీవల భక్తుల సౌకర్యాల విస్తరణ, క్యూ లైన్ల నిర్వహణ, పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం, తాగునీటి సదుపాయాల పెంపు, ప్రసాదాల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ, డిజిటల్ సేవల విస్తరణ, సిబ్బంది సేవాభావంతో వ్యవహరించేలా తీసుకున్న చర్యలు భక్తుల సంతృప్తి పెరగడానికి దోహదపడినట్లు అధికారులు భావిస్తున్నారు.దేవాదాయ శాఖ తాజా పనితీరు నివేదికతో రాష్ట్రవ్యాప్తంగా భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్న దేవాలయాల జాబితాలో విజయవాడ శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం మరోసారి ప్రత్యేక స్థానం సంపాదించింది.