వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు..

  • కుబీర్‌లో ఖరీఫ్ సాగుపై ఆందోళన

కుబీర్, ఆంధ్రప్రభ : ఖరీఫ్ సీజన్ ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా కుబీర్ మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఒక్క మోస్తరు వర్షం కూడా కురవకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. సాధారణంగా ఈ సమయానికి పొలాలు పచ్చని పంటలతో కళకళలాడాల్సి ఉండగా, ప్రస్తుతం ఎండిన నేలలు, వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులే కనిపిస్తున్నారు. వరుణదేవుడి కరుణ కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ సీజన్‌లో పత్తి, సోయాబీన్, కంది తదితర పంటల సాగు కోసం రైతులు ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేశారు. కొందరు ప్రైవేట్ అప్పులు చేయగా, మరికొందరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పెట్టుబడులు పెట్టారు. ప్రారంభంలో ఒకటి, రెండు సార్లు చిరుజల్లులు కురవడంతో ఆశలు చిగురించి విత్తనాలు వేశారు. అనంతరం వర్షాలు పూర్తిగా ముఖం చాటేయడంతో నేలలో తేమ లేక విత్తనాలు, మొలకెత్తిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

కుబీర్ మండలంలోని అధిక భాగం వ్యవసాయం పూర్తిగా వర్షాధారంగానే సాగుతోంది. చెరువులు, కుంటలు, వాగుల్లో నీటి నిల్వలు లేకపోవడం, భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పట్టడంతో బోర్‌వెల్‌ల ద్వారా సాగునీరు అందించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ప్రత్యామ్నాయంగా నీటి వనరులు కూడా రైతులకు అందుబాటులో లేవు.

ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుండటంతో నేలలోని తేమ వేగంగా ఆవిరైపోతోంది. మరోసారి వర్షాలు ఆలస్యమైతే రెండోసారి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పెట్టుబడి మరింత పెరిగి ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

వ్యవసాయ పనులపై ఆధారపడే కూలీల పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. పొలాల్లో పనులు లేక ఉపాధి కోల్పోయిన కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులు నెలకొంటున్నాయని గ్రామస్తులు తెలిపారు. పశువులకు మేత కొరత ఏర్పడే ప్రమాదం కూడా రైతులను కలవరపెడుతోంది.

వాతావరణంలో మేఘాలు కనిపిస్తున్నప్పటికీ వర్షం కురవకపోవడం, ఎల్‌నీనో ప్రభావంతో వర్షపాతం అస్థిరంగా ఉండడం రైతుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. మరో వారం రోజుల్లో మంచి వర్షాలు కురవకపోతే ఖరీఫ్ సాగు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వర్షాలు కురిసి పంటలు కాపాడాలని రైతులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.