ఆరోగ్య సమస్యకు పరిష్కారం

బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా నేడు అర్జీదారులకు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందించారు. కర్లపాలెం మండలం ప్యార్లి గ్రామ ఆయుష్ వైద్య కేంద్రానికి చెందిన డాక్టర్ పి. సిద్ధార్థ, డాక్టర్ భువనేశ్వరి, పీటీఎస్ సుబ్బారావు, కాంపౌండర్ రమేష్, యోగ ఇన్‌స్ట్రక్టర్ రవి తదితరులు పాల్గొని అర్జీదారుల ఆరోగ్య సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని తగిన వైద్య సూచనలు అందించారు.వైద్యులు అవసరమైన వారికి ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేసి, వాటిని ఎలా వాడాలో వివరించారు. అలాగే మందుల వినియోగ విధానాన్ని లిఖితపూర్వకంగా రాసి అందజేశారు. ప్రజా సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యల పరిష్కారానికీ ప్రాధాన్యం ఇస్తూ వైద్య శిబిరం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అర్జీదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా జిల్లా ప్రజల నుంచి కలెక్టర్‌కు ప్రశంసలు లభిస్తున్నాయి.