వరల్డ్ ఛాంపియన్స్ గా ఆస్ట్రేలియా… ఏడో టైటిల్ కైవసం !
- ఇంగ్లండ్‌పై 7 వికెట్ల ఘన విజయం
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ ఆధిపత్యం..
ఆంధ్రప్రభ : ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ‘హోమ్ ఆఫ్ క్రికెట్’గా పిలిచే లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి తమ ఏడో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
అయితే, ఆస్ట్రేలియా.. ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఎనిమి సార్లు వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడగా.. అందులో ఏడో సార్లు విజయాన్ని నమోదు చేసిన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌పై వరుసగా నాలుగు సార్లు విజయం సాధించి 100% రికార్డును కొనసాగించింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ !
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పవర్‌ప్లేలోనే ఓపెనర్లు ఏమీ జోన్స్ (6), డేనియెల్ వ్యాట్-హాడ్జ్ (8) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. కెప్టెన్ నాట్ సివర్-బ్రంట్ మూడో స్థానంలో వచ్చి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఆమెకు ఆలిస్ క్యాప్సీ (23) మంచి సహకారం అందించింది. ఇద్దరూ కలిసి 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 10వ ఓవర్లో క్యాప్సీ వికెట్ కోల్పోవడంతో ఇంగ్లండ్ ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత హీథర్ నైట్ (2) కూడా త్వరగా ఔట్ కావడంతో స్కోరు 70/4కు పడిపోయింది.
ఈ దశలో నాట్ సివర్-బ్రంట్, ఫ్రేయా కెంప్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. సివర్-బ్రంట్ అద్భుత అర్ధశతకం పూర్తి చేసింది. చివర్లో కెంప్ 28 బంతుల్లో 44* పరుగులతో మెరుపులు మెరిపించింది. ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 150/4 స్కోరు చేసింది. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, సోఫీ మోలినెక్స్, అన్నాబెల్ సదర్లాండ్ ఒక్కో వికెట్ తీశారు.
ఆస్ట్రేలియా దూకుడు ఛేజింగ్..
151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే జార్జియా వోల్ (9) వికెట్ కోల్పోయినా, తర్వాత మ్యాచ్ పూర్తిగా వారి వైపు తిరిగిపోయింది. బెత్ మూనీ, ఫోబీ లిచ్‌ఫీల్డ్ దూకుడుగా ఆడి పవర్‌ప్లేలోనే జట్టును 62/1 వద్ద నిలిపారు. ఇంగ్లండ్ బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. మూనీ కేవలం 38 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసింది. ఇద్దరూ కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా, లిచ్‌ఫీల్డ్ 48 పరుగుల వద్ద ఔట్ అయింది. అప్పటికే మ్యాచ్ ఆస్ట్రేలియా చేతుల్లోకి వెళ్లిపోయింది. మూనీ 64 (49 బంతులు) వద్ద ఔట్ అయినప్పటికీ, ఎల్లీ పెర్రీ (13), ఆష్లే గార్డ్నర్ (3) నిలకడగా ఆడి జట్టును 17.1 ఓవర్లలోనే లక్ష్యానికి చేర్చారు. దీంతో ఆస్ట్రేలియా మరోసారి ప్రపంచ క్రికెట్లో తమ ఆధిపత్యాన్ని నిరూపిస్తూ ట్రోఫీని ముద్దాడింది.
