అమెరికాలో కాల్పుల కలకలం..

  • న్యూయార్క్‌లో 8 మందికి గాయాలు
  • స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో ఘటన..
  • దర్యాప్తులో పోలీసులు

ఆంధ్రప్రభ, న్యూయార్క్ : అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో న్యూయార్క్ నగరంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. బ్రూక్లిన్‌లోని ప్రసిద్ధ కోనీ ఐలాండ్ (Coney Island) ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు చిన్నారులతో సహా మొత్తం ఎనిమిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

జూలై 4 రాత్రి బాణాసంచా ప్రదర్శన ముగిసిన కొద్దిసేపటికే సర్ఫ్ అవెన్యూ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో అక్కడ ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం నెలకొంది.

గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వారిలో 21 ఏళ్ల మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించగా, మిగతా బాధితుల పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ఈ ఘటనలో ఘటనా స్థలంలో ఒక తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాల్పులకు పాల్పడింది ఎంతమంది? వారి ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.