Elections-2029 : పార్టీ కోసం Andhra Prabha Top News
Elections-2029 : పార్టీ కోసం Andhra Prabha Top News
- ప్రజల కోసం
- పని చేద్దాం
- రౌడీయిజానికి తావులేదు
- స్థానిక సంస్థల ఎన్నికల్లో
- అన్ని స్థానాల్లో గెలవాలి
- పనితీరు ఆధారంగానే పదవులు,
- 2029లో మరింత భారీ విజయమే లక్ష్యం
- పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
చిత్తూరు,ఆంధ్రప్రభ బ్యూరో:
Elections-2029 : కుప్పం నియోజకవర్గంలో రౌడీయిజానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదని, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే వారిని ఎవరినీ ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి స్థానంలో కూటమి విజయం సాధించేలా పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ కోసం నిజాయితీగా శ్రమించిన కార్యకర్తలను ఎన్నటికీ విస్మరించబోమని, పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని తేల్చిచెప్పారు. కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం చివరి రోజు రైతులు, పీ4 లబ్ధిదారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు అనంతరం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పైస్థాయిలో మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో కూడా రాజకీయ పరిపాలన బలోపేతం కావాలని అన్నారు. గ్రామాలు, వార్డుల్లో ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ప్రభుత్వ అధికారులు, పోలీసులతో సమన్వయం పెంచుకుని సమస్యలను వేగంగా పరిష్కరించేలా వ్యవహరించాలని కోరారు. పేదల పక్షాన నిలబడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తి సహకారం అందించాలని, మంచి పనులు చేసే వారిని అధికారులు గౌరవించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా ప్రజలకు చేరుతున్నాయా లేదా అనే అంశాన్ని పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని చంద్రబాబు సూచించారు. ఎక్కడైనా పథకాల అమలులో జాప్యం లేదా లోపాలు కనిపిస్తే వాటిని వెంటనే సరిదిద్దే బాధ్యత కూడా పార్టీ శ్రేణులదేనన్నారు. రాజకీయాలతో పాటు సామాజిక సేవకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ ద్వారా రాజకీయ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు, అలాంటి ప్రయత్నాల పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 2019 నుంచి 2024 మధ్య రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, అదే సమయంలో కుప్పం నియోజకవర్గ ప్రశాంతతను కూడా దెబ్బతీయాలని ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు.

ప్రస్తుతం ప్రభుత్వం శాంతిభద్రతలు, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, కుప్పంలో రౌడీయిజానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదని స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమని పేర్కొన్న చంద్రబాబు, ప్రతి స్థానం గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో కూటమి విజయమే ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు సమాజంలో మంచి గుర్తింపు ఉందని, ఆ పేరుకు మచ్చ తెచ్చేలా ఎవరూ వ్యవహరించకూడదని హెచ్చరించారు. పార్టీలో పదవులు పూర్తిగా పనితీరు ఆధారంగానే ఉంటాయని, నియామకాల విషయంలో ఎలాంటి మొహమాటాలు ఉండవని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించబోమని, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా నిజమైన కార్యకర్తలను గౌరవించాలని సూచించారు.
బూత్ స్థాయి నుంచి ఏ పదవికైనా కార్యకర్తల ఆమోదం ఉండేలా పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. 2029 ఎన్నికల్లో కూడా కూటమి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, గత ఎన్నికల కంటే మరింత భారీ మెజారిటీ సాధించే లక్ష్యంతో ఇప్పటి నుంచే పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యకర్తల ఆర్థిక సాధికారత కోసం పార్టీ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటికో పారిశ్రామికవేత్త విధానాన్ని కార్యకర్తలు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పార్టీ సూచనలకు అనుగుణంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించిన చంద్రబాబు, కుప్పం నియోజకవర్గంలో అందరి ఆమోదంతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు.

మూడు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ, కార్యకర్తల సంక్షేమం వంటి అంశాలపై ముఖ్యమంత్రి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సమావేశం అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతాల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
