నాగిరెడ్డిపల్లిలో సబ్ రేషన్ దుకాణం ప్రారంభం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఆదివారం తెరపడింది. ఇప్పటి వరకు ప్రతి నెలా రేషన్ సరుకులు పొందేందుకు గ్రామస్తులు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని కొల్లూర్ గ్రామానికి వెళ్లాల్సి వచ్చేది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో గ్రామస్థులు పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు.

గ్రామ ప్రజల సమస్యను గుర్తించిన రాష్ట్ర పాడి పరిశ్రమల, మత్స్య, క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు నాగిరెడ్డిపల్లి గ్రామంలో సబ్ రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.సబ్ రేషన్ దుకాణం ప్రారంభం కావడంతో ఇకపై గ్రామస్తులు రేషన్ సరుకుల కోసం కొల్లూర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ గ్రామంలోనే సులభంగా సరుకులు పొందనున్నారు.

దీంతో ప్రతి నెలా సమయం, ప్రయాణ వ్యయం ఆదా కావడంతో పాటు ప్రజలకు ఎంతో ఉపశమనం లభిస్తుందని తమ గ్రామానికి ప్రతి నెల 30 క్వింటాళ్ల బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని సర్పంచ్ బస్వరాజ్,తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించి తమకు సౌకర్యం కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచు నరసింహులు, వార్డు సభ్యులు నాయకులు జనార్ధన్ రెడ్డి, నాగిరెడ్డి తిమ్మయ్య పరమేష్ జగదీష్ టైలర్ శంకర్, కురుమప్ప తదితరులు పాల్గొన్నారు.