Cricket | ఇషాన్ కిషన్ జోరు..

ఈ ఏడాది అత్యధిక టీ20 పరుగులు
టీ20 అంతర్జాతీయాల్లోనూ టాప్ రన్ స్కోరర్
నిలకడైన ప్రదర్శనతో అదరగొడుతున్న వికెట్‌కీపర్ బ్యాటర్

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : 2026లో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్బుతంగా రాణిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్ నుంచి ఐపీఎల్, టీ20 ప్రపంచకప్, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడమే కాకుండా, టీ20 అంతర్జాతీయాల్లోనూ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

2025-26 దేశవాళీ సీజన్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌కు చారిత్రాత్మక టైటిల్ అందించిన ఇషాన్, టోర్నీలో 517 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే ఫామ్‌ను టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తూ భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రపంచకప్‌లో 317 పరుగులు చేసి జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా ఇషాన్ నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 47 ఇన్నింగ్స్‌ల్లో 1,341 టీ20 అంతర్జాతీయ పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక సెంచరీ, పది అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ఇంగ్లాండ్‌తో జరిగిన తాజా టీ20 మ్యాచ్‌లో కూడా ఇషాన్ కిషన్ 49 పరుగులతో భారత ఇన్నింగ్స్‌కు కీలక సహకారం అందించాడు. జట్టు ఓడిపోయినప్పటికీ అతని బ్యాటింగ్ మరోసారి ప్రశంసలు అందుకుంది.

దూకుడైన ఆటతీరు, నిలకడైన ప్రదర్శనతో 2026ను తన కెరీర్‌లోనే అత్యుత్తమ సంవత్సరంగా మలుచుకుంటున్న ఇషాన్ కిషన్, భారత్ టీ20 జట్టులో అత్యంత కీలక ఆటగాడిగా అవతరించాడు. అతని ఫామ్ ఇలాగే కొనసాగితే రానున్న టోర్నీల్లోనూ భారత జట్టుకు అతడు ప్రధాన బలంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.