US-Iran Tensions Rise Again? – Trump’s Explosive Warning as Iran | హర్మూజ్‌లో టోల్ ఫీజుతో మరో కలకలం..
US-Iran Tensions Rise Again? – Trump’s Explosive Warning as Iran | హర్మూజ్‌లో టోల్ ఫీజుతో మరో కలకలం..
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలపై సందిగ్ధం
‘ఒకే దెబ్బతో అందరినీ అంతం చేయగలం.. కానీ!’
“అవి నిజమైన కన్నీళ్లా.. లేక నకిలీవా?”
అమెరికా అధ్యక్షడు ట్రంప్ వ్యాఖ్యలు
US-Iran Tensions Rise Again? – Trump’s Explosive Warning as Iran | ఆంధ్రప్రభ వెబ్, అంతర్జాతీయ ప్రతినిధి:
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు తిరిగి ప్రారంభమవుతాయన్న ఆశలు వ్యక్తమవుతున్న వేళ.. ఇరు దేశాల నుంచి వెలువడిన తాజా ప్రకటనలు మరోసారి ఉద్రిక్తతలకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు హర్మూజ్ జలసంధిలో టోల్ (సేవా రుసుము) విధించనున్నట్లు చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహ్మానీ చేసిన ప్రకటనతో అంతర్జాతీయంగా కొత్త చర్చ మొదలైంది. దీంతో అమెరికా-ఇరాన్ సంబంధాలు మళ్లీ ఉద్రిక్తతల దిశగా వెళ్తాయా? లేక శాంతి చర్చలు కొనసాగుతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
‘ఒకే దెబ్బతో అందరినీ అంతం చేయగలం.. కానీ!’
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన ఇరాన్ అగ్రనేతలందరూ ఒకేచోట ఉన్నారని, “ఒకే దెబ్బతో వారందరినీ అంతం చేసే అవకాశం ఉన్నా.. ప్రస్తుతం అలా చేయం. ఎందుకంటే చర్చలు జరపడానికి ఎవరూ మిగలరు” అని వ్యాఖ్యానించారు.
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న అణు చర్చలకు ఖమేనీ సంతాప కార్యక్రమాల కారణంగా వారం రోజుల పాటు విరామం ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయం పరస్పర అంగీకారంతో తీసుకున్నదేనని, ఈ సమయంలో ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి దాడులు చేయవని చెప్పారు. జూలై 9న సంతాప కార్యక్రమాలు ముగిసిన తర్వాత కాల్పుల విరమణ కొనసాగితే చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
టెహ్రాన్‌లో వేలాది మంది ఖమేనీకి నివాళులర్పిస్తూ కన్నీటి పర్యంతం కావడంపైనా ట్రంప్ స్పందించారు. ఖమేనీని ప్రజలు ద్వేషిస్తారని తాను భావించానని, అయితే పెద్ద సంఖ్యలో ప్రజలు విలపించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. “అవి నిజమైన కన్నీళ్లా.. లేక నకిలీవా?” అంటూ వ్యాఖ్యానించారు.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఒకవైపు చర్చలకు సిద్ధమని చెబుతూనే, మరోవైపు ఇరాన్ నాయకత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దౌత్యపరంగా ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముంది.
హర్మూజ్‌లో టోల్ ఫీజు.. ఇరాన్ కీలక నిర్ణయం
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో కొత్త సేవా రుసుము (టోల్) విధానాన్ని అమలు చేయనున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహ్మానీ వెల్లడించారు.
హర్మూజ్ జలసంధి తమ ప్రాదేశిక జలాల్లో భాగమని పేర్కొన్న ఆయన.. ఇకపై అక్కడ ప్రయాణించే నౌకల నుంచి సేవా రుసుము వసూలు చేస్తామని తెలిపారు. దీనిపై ఒమన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, కష్టకాలంలో ఇరాన్‌కు అండగా నిలిచిన మిత్రదేశాలకు టోల్ విషయంలో ప్రత్యేక రాయితీలు లేదా మినహాయింపులు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
ఇకపై హర్మూజ్‌లో నౌకల భద్రత, రాకపోకల పర్యవేక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను ఒమన్‌తో కలిసి నిర్వహించనున్నట్లు కూడా ప్రకటించారు.
ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెమ్ గరీబాబాది మాట్లాడుతూ.. హర్మూజ్ జలసంధి ఇతర దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహించే ప్రాంతం కాదని హెచ్చరించారు. అలాగే ఇరాన్ నిర్దేశించిన సముద్ర మార్గాన్ని పాటించకుండా ఒమన్ తీరం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన ఎనిమిది నౌకలను వెనక్కి పంపినట్లు అంతర్జాతీయ షిప్పింగ్ నివేదికలు వెల్లడించాయి.
ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం?
హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో రవాణా అయ్యే ముడి చమురులో దాదాపు 20 శాతం ఈ జలసంధి ద్వారానే వెళ్తుంది. అందువల్ల ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇరాన్ సేవా రుసుము అమలు చేస్తే చమురు రవాణా వ్యయం పెరిగే అవకాశం ఉందని, దాని ప్రభావం చమురు దిగుమతులపై ఆధారపడిన భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలపై ఎక్కువగా ఉండొచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
శాంతి చర్చలు కొనసాగుతాయా?
ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు పూర్తిగా తలుపులు మూసుకుపోలేదు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు, హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయాలు పరిస్థితులను మరింత సంక్లిష్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇరు దేశాల తదుపరి చర్యలే మధ్యప్రాచ్య భద్రతతో పాటు ప్రపంచ చమురు మార్కెట్ దిశను కూడా నిర్ణయించే అవకాశముందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు
also read
