ముందస్తు అరెస్టులు కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుచేటు..
- బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ నాయకుడు డా. రాజా రమేష్
క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించి, నిలిచిపోయిన పంపులను ప్రారంభించేందుకు వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ నాయకుడు డా. రాజా రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల పట్ల కనీస ప్రేమ, అవగాహన ఉంటే నాయకులను అరెస్ట్ చేయించకుండా, వృథాగా పోతున్న కాళేశ్వరం నీటిని కన్నెపల్లి పంపుల ద్వారా రిజర్వాయర్లలోకి తరలించి రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి పోలీసు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు.
ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా ప్రజల పక్షాన నిలబడి, రైతులకు న్యాయం జరిగే వరకు నిరంతరం పోరాడతామని తెలిపారు.
ఈ సందర్భంగా కంబగొని సుదర్శన్ గౌడ్, వంశీకృష్ణ, రెవెల్లి ఓదెలు, ఖలీం, రామిడి లక్ష్మీకాంత్, కరుణాకర్, శివ, మణికుమార్, అవినాష్ తదితరులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
