ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్‌పై చేసిన వ్యాఖ్యలను భీంగల్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం భీంగల్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు స్పందించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పర్స అనంతరావు మాట్లాడుతూ, తమ పార్టీ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌తో పోల్చుకునే అర్హత కూడా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి లేదని విమర్శించారు. రాజీనామా చేసి ప్రజల తీర్పుకు రావాలని, కాంగ్రెస్ పార్టీ సాధారణ కార్యకర్త కూడా ఆయనను ఓడించగలడని అన్నారు.

మున్సిపల్ చైర్మన్ బొదిరే స్వామి మాట్లాడుతూ, గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో రిమాండ్‌కు వెళ్లిన వ్యక్తి తమ నాయకులపై విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. మరోసారి కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు రాష్ట్రానికి ఎంత మేర నిధులు తీసుకొచ్చారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నాగేంద్ర బాబు, మాజీ పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ కన్నె సురేందర్, బాబాపూర్ గ్రామ సర్పంచ్ సమీర్, మెండోరా ఉపసర్పంచ్ కుంట రమేశ్, 12వ వార్డు ఇంచార్జి సుంకరి సురేష్, మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సురేష్, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నిచ్చం మహేష్, మందుల కిరణ్, బొమ్మెన అజయ్, నవీద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.