కాళేశ్వరం పంప్‌హౌస్ వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యే సంజయ్‌ను అడ్డుకున్న పోలీసులు
బారికేడ్లు దాటి రెండో గేటు వరకు దూసుకెళ్లిన నేతలు
పోలీసులతో వాగ్వాదం
మహదేవ్‌పూర్, జూలై 5 (ఆంధ్రప్రభ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం పర్యటనకు ముందు ప్రాజెక్టు పరిస్థితులను పరిశీలించి, పంప్‌హౌస్‌లో నిలిచిపోయిన మోటార్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించేందుకు వెళ్లారు. అయితే, పోలీసులు ముందస్తుగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసి నాయకుల రాకను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు కె. విద్యాసాగర్ రావు (జీవన్ రెడ్డి), దయాకర్ రావు, కోరుకంటి చందర్, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పంప్‌హౌస్‌కు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ ముందుకు వెళ్లనీయకుండా నిలువరించారు. ప్రజాప్రతినిధులను ప్రభుత్వ ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఎమ్మెల్యే సంజయ్ పోలీసులను ప్రశ్నించారు. ప్రాజెక్టు పరిస్థితులను పరిశీలించే హక్కు తమకు ఉందని, ప్రజల తరఫున ప్రశ్నించేందుకే వచ్చామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఉద్రిక్తత మధ్య ఎమ్మెల్యే సంజయ్‌తో పాటు పలువురు నాయకులు మొదటి భద్రతా వలయాన్ని దాటి రెండో గేటు వరకు చేరుకోగలిగారు. అక్కడ కూడా పోలీసులు వారిని నిలువరించడంతో మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఇదే సమయంలో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు గేటు దూకి పంప్‌హౌస్ ఆవరణలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని భావించిన అధికారులు అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాన్ని పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ అనుమతి లేకుండా లోపలికి వెళ్లనివ్వలేదు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ పరిస్థితిపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిలిచిపోయిన మోటార్లను వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాజెక్టు నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయడానికే తమ పర్యటన అని పేర్కొన్నారు.
మరోవైపు, కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే నాయకులను నిలువరించినట్లు పోలీసులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతుండగా, ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. మొత్తం ఘటనతో కన్నెపల్లి పంప్‌హౌస్ పరిసరాల్లో గంటలపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, కేటీఆర్ పర్యటన నేపథ్యంలో రాజకీయంగా కూడా ఉత్కంఠ నెలకొంది.
