సిద్ధాంత అవగాహనతోనే ప్రజా ఉద్యమాలు బలోపేతం: ఎమ్మెల్యే కూనంనేని

  • తొర్రూరులో సీపీఐ జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభం
  • ప్రజా సమస్యలపై చైతన్యంతో ఉద్యమాలు చేపట్టాలని పిలుపు

తొర్రూరు రూరల్, జూలై 5 (ఆంధ్రప్రభ): సిద్ధాంతపరమైన అవగాహన, క్రమశిక్షణతో కూడిన రాజకీయ చైతన్యంతోనే ప్రజా ఉద్యమాలు మరింత బలోపేతం అవుతాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం తొర్రూరులోని లయన్స్ భవన్‌లో నిర్వహించిన సీపీఐ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ నాయకులు సిద్ధాంతపరమైన స్పష్టతతో ముందుకు సాగాలని, సమాజంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేస్తూ ప్రజల పక్షాన పోరాటాలను మరింత విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ శిక్షణ పార్టీ నిర్మాణానికి, ఉద్యమాలకు బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

అనంతరం వివిధ అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ‘మార్క్సిజం – సమకాలీన సమాజంలో దాని ప్రాధాన్యత’పై కామ్రేడ్ మధుకర్, ‘తీవ్ర ఆర్థిక సంక్షోభంలో భారతదేశం – పర్యవసానాలు’పై కామ్రేడ్ బీఎస్‌ఆర్ మోహన్‌రెడ్డి, ‘మతం, మతోన్మాదం – లౌకికవాదం – కేంద్రంలో అమలవుతున్న హిందుత్వ ఎజెండా’పై కామ్రేడ్ ఉమా మహేష్ బోధనలు నిర్వహించి కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయ్ సారధి, జిల్లా సహాయ కార్యదర్శులు బి. అజయ్ సారధి, నల్లు సుధాకర్, రాష్ట్ర సమితి సభ్యుడు కట్టబోయిన శ్రీనివాస్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ మాజీ సభ్యుడు తమ్మెరా విశ్వేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.