కేటీఆర్ పర్యటనతో కాళేశ్వరంలో కట్టుదిట్టమైన భద్రత..

మహాదేవ్‌పూర్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో ఆదివారం కాళేశ్వరం ప్రాంతమంతా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దుల నుంచే వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు, కాళేశ్వరం గ్రామంలోకి వచ్చే ప్రతి మార్గంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తల రాకపోకలను కట్టుదిట్టంగా నియంత్రించారు.

ఈ సందర్భంగా శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదన్ చారి తన అనుచరులతో కలిసి కాళేశ్వరం వైపు వస్తుండగా, మద్దులపల్లి క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా కారణాలను చూపుతూ కేవలం నాలుగు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో అక్కడ కొంతసేపు పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

పోలీసుల నిర్ణయంపై నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం సిరికొండ మధుసూదన్ చారికి మాత్రమే అనుమతి ఇవ్వగా, ఆయన వెంట వచ్చిన పలువురు నాయకులు, కార్యకర్తలను అక్కడే నిలిపివేశారు.

కేటీఆర్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాంతంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. గ్రామ ప్రవేశ ద్వారాలు, ప్రధాన కూడళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు, దేవాలయ పరిసరాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.

కాళేశ్వరం గ్రామంలోకి వచ్చే అన్ని ప్రధాన రహదారుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు, స్థానికులతో పాటు బయటి ప్రాంతాల నుంచి వచ్చే వారిపై కూడా ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, గ్రామమంతా భద్రతా దళాల కట్టుదిట్టమైన నిఘాతో పోలీసు వాహనాల రాకపోకలు పెరిగాయి.

కేటీఆర్ పర్యటన ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు విస్తృత భద్రతా చర్యలు చేపట్టగా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల రాకపోకలపై విధించిన పరిమితులు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.