చీకుపల్లి వంతెన పనుల్లో జాప్యం..

వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని జగన్నాధపురం వై జంక్షన్ నుండి చెరుకూరు గ్రామ శివారు వరకు విస్తరించిన జాతీయ రహదారి–163 రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా చీకుపల్లి గ్రామం వద్ద ఇసుక వాగుపై నూతన వంతెన నిర్మాణం చేపట్టారు. ఆరు నెలలు గడిచినప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వంతెన నిర్మాణం కోసం పాత వంతెనను కూల్చివేసి తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేశారు. గోదావరి వరదలు వచ్చిన సందర్భంలో ఈ తాత్కాలిక మార్గం నీటమునిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో రవాణా పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

వరదలు పెరిగితే చీకుపల్లి ఇసుక వాగు పరిధిలోని సుమారు 25 గ్రామాలకు రాకపోకలు స్తంభించే ప్రమాదం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఇదే మార్గంపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు.

వర్షాకాలంలో చిన్నపాటి వరదలకే రహదారి నిలిచిపోతే విద్య, వైద్యం, వ్యవసాయం, నిత్యావసరాల రవాణా తీవ్రంగా ప్రభావితమవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, గర్భిణీలు, రోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ అంశంపై సీపీఎం ఆధ్వర్యంలో ఇప్పటికే ఆందోళన చేపట్టారు.

వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.