Cancer Drug Cost | అమెరికాలో రూ.85 వేల.. భారత్‌లో రూ.35కే?

అమెరికన్ మహిళ వ్యాఖ్యలు వైరల్
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ‘రెవ్లిమిడ్’ ధరలపై అమెరికన్ మహిళ వ్యాఖ్యలు వైరల్
భారత్‌లో తక్కువ ధరకు మందులు లభిస్తున్నాయని వీడియోలో పేర్కొన్న మహిళ
ఔషధ ధరలు, ఆరోగ్య వ్యవస్థలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ

Cancer Drug Cost | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : అమెరికాలో క్యాన్సర్ చికిత్సలో వినియోగించే ‘రెవ్లిమిడ్’ (Revlimid) ఔషధం ధరపై ఓ అమెరికన్ మహిళ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అమెరికాలో ఈ ఔషధం కోసం సుమారు రూ.85 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని, అదే ఔషధం భారత్‌లో కేవలం రూ.35కే లభిస్తోందని ఆమె వీడియోలో పేర్కొన్నారు. భారత్‌లో తక్కువ ధరలకు నాణ్యమైన వైద్యం, జనరిక్ ఔషధాలు అందుబాటులో ఉండటం ప్రశంసనీయమని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు, అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థ కారణంగా రోగులు అధిక ఖర్చులు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. “మందుల కోసం అమెరికాలో భారీ మొత్తం ఖర్చు చేయడం కంటే భారత్‌కు విమానంలో వచ్చి కొనుగోలు చేయడమే చవక” అంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు భారత ఔషధ పరిశ్రమ, ముఖ్యంగా జనరిక్ మందుల తయారీ సామర్థ్యాన్ని ప్రశంసిస్తున్నారు.

అయితే, ఒకే ఔషధానికి దేశానికొక విధంగా ధరలు ఉండటానికి పేటెంట్లు, బ్రాండ్, జనరిక్ ఔషధాలు, బీమా విధానాలు, ప్రభుత్వ ధర నియంత్రణలు, మార్కెట్ విధానాలు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వైరల్ అవుతున్న ధరల వివరాలను ఆయా దేశాల్లో విక్రయించే ఔషధ రకం, మోతాదు, తయారీ సంస్థ, బీమా వర్తింపు వంటి అంశాల ఆధారంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

అమెరికన్ మహిళ వీడియో మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఔషధాల ధరలు, ఆరోగ్య సేవల వ్యయం, జనరిక్ మందుల ప్రాధాన్యంపై మరోసారి చర్చకు దారితీసింది.