Revanth Reddy | సీఎంకు శుభాకాంక్షల వెల్లువ
Revanth Reddy | సీఎంకు శుభాకాంక్షల వెల్లువ
రాజకీయ ప్రస్థానంలో 20 ఏళ్లు పూర్తి..
మండల స్థాయి ప్రజాప్రతినిధిగా మొదలై ముఖ్యమంత్రి పదవి వరకు ఎదిగిన ప్రయాణానికి ప్రశంసలు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి, వాకిటి శ్రీహరి అభినందనలు
ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రజాప్రతినిధిగా ప్రారంభమైన రాజకీయ ప్రయాణాన్ని అంచెలంచెలుగా విస్తరించుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితంలో మరో కీలక మైలురాయి నమోదైంది. ఆయన రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
మండల స్థాయి ప్రజాప్రతినిధిగా ప్రారంభమైన రాజకీయ ప్రయాణం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరకు విజయవంతంగా సాగిన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు విడుదల చేసిన సందేశాల్లో రేవంత్‌రెడ్డి ప్రజలతో మమేకమై, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ రాజకీయ జీవితంలో ఎన్నో కీలక మైలురాళ్లు అధిగమించారని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత ప్రజాస్వామ్య బాధ్యత అయిన ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ఆయన కృషి, పట్టుదల, నాయకత్వానికి నిదర్శనమని కొనియాడారు.
తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుస్థిర పాలన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని అభినందనలు తెలియజేశారు.
రాజకీయ జీవితంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానుల నుంచి సామాజిక మాధ్యమాల వేదికగా కూడా పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
