ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణించిన ఆర్టీసీ డీఎం
అచ్చంపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో, అచ్చంపేట ఆర్టీసీ డిపోకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిపో మేనేజర్ శ్రీనివాసులు గురువారం అచ్చంపేట నుంచి నాగర్‌కర్నూల్ వరకు పల్లెవెలుగు బస్సులో ప్రయాణించి ప్రయాణికుల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు, ఇతర ప్రయాణికులతో మాట్లాడి వారికి ఎదురవుతున్న ఇబ్బందులు, అవసరమైన సౌకర్యాలపై ఆరా తీశారు. బస్సుల సమయపాలన, రద్దీ పరిస్థితులు, సీట్ల లభ్యత, ప్రయాణ సౌకర్యాలపై ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుని పలు సూచనలు స్వీకరించారు.
ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు బస్సులో ప్రయాణిస్తున్నట్లు డీఎం శ్రీనివాసులు తెలిపారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం కల్పించేందుకు ఆర్టీసీ కట్టుబడి ఉందన్నారు.
డీఎం చేపట్టిన ఈ వినూత్న చర్యను ప్రయాణికులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
