స్కూల్ బస్సు డ్రైవర్లకు ట్రాఫిక్ పాఠాలు చెప్పిన ఎస్‌ఐ సాంబమూర్తి

మహాదేవ్‌పూర్,ఆంధ్రప్రభ: విద్యార్థుల భద్రతే ప్రతి స్కూల్ బస్సు డ్రైవర్ తొలి బాధ్యతగా భావించాలని మహాదేవ్‌పూర్ ఎస్‌ఐ ఎం. సాంబమూర్తి సూచించారు. మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన స్కూల్ బస్సు డ్రైవర్ల అవగాహన, కౌన్సెలింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగంగా వాహనాలు నడపరాదని ఆయన సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. విద్యార్థుల ప్రాణభద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి డ్రైవర్ అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని కోరారు.

బస్సుల్లో నిర్ణీత సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించరాదని, ప్రతి రోజు వాహనం బయలుదేరే ముందు బ్రేకులు, టైర్లు, లైట్లు, స్టీరింగ్ వంటి భద్రతా పరికరాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. విద్యార్థులు బస్సు ఎక్కే సమయంలో, దిగే సమయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులతో సమన్వయం చేసుకుంటూ సురక్షిత రవాణా కల్పించాలని తెలిపారు.

పిల్లల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే స్కూల్ బస్సు డ్రైవర్లు, యాజమాన్యాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల స్కూల్ బస్సు డ్రైవర్లు పాల్గొని రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, విద్యార్థుల సురక్షిత రవాణాకు సంబంధించిన సూచనలు తెలుసుకున్నారు.