గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేస్తాం: ఎంపీడీవో పావని

ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనులను వేగవంతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ బీజేపీకి చెందిన సర్పంచ్‌లు బుధవారం నూతన ఎంపీడీవో పావనిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆమెకు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌లు గ్రామాల్లో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాల సమస్యలను ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

దీనికి స్పందించిన ఎంపీడీవో పావని మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుక భరత్, కొత్తపల్లి సర్పంచ్ ఆర్. నర్సిములు, బిజ్వార్ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్, బిజ్వార్ సీనియర్ నాయకుడు ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.