ఓటర్ల మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు: జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

నరసాపురం, ఆంధ్రప్రభ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్రోల్మెంట్ ఫారాల డిజిటలైజేషన్, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

సోమవారం నరసాపురం తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మ్యాపింగ్, డిజిటలైజేషన్ పనుల పురోగతిని బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు)ను అడిగి తెలుసుకున్నారు.

జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, 2002 ఓటర్ల జాబితాతో సరిపోల్చి మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల నమోదులో పూర్వీకుల వివరాల ఆధారంగా అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉందన్నారు.

ఒక బీఎల్‌వో పరిధిలోని ఓటర్ల వివరాలు మరో బీఎల్‌వో పరిధికి చెందినవిగా ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని సందర్శించి ఎన్రోల్మెంట్ ఫారాలను అందజేయడంతో పాటు, పాత ఓటర్ల జాబితాలో నమోదైన చిరునామాలో ఓటరు లేకపోతే వారి కొత్త చిరునామా వివరాలను సేకరించి నమోదు చేయాలని సూచించారు.

పెండింగ్‌లో ఉన్న ఓటర్ల మ్యాపింగ్‌ను త్వరగా పూర్తి చేసి, అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా నమోదు కాకుండా మిగలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించి నూరు శాతం పూర్తి చేయాలని, బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, తహసీల్దార్ నాగార్జున, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.