Voter Enumeration | ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
Voter Enumeration | ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
Voter Enumeration |ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఓటరు గణన (ఎన్యూమరేషన్ ప్రక్రియ) శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ ప్రక్రియపై ఓటర్లలో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన కొన్ని సాంకేతిక మార్పులు, ఓట్ల తొలగింపునకు సంబంధించిన అంశాల వల్ల ప్రజల్లో ఈ ఓటరు గణనపై పలు అనుమానాలు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో, ఓటర్ల అనుమానాలను నివృత్తి చేయడానికి ఎన్నికల సంఘం నిరంతరం అవగాహన కార్యక్రమాలను, ప్రచారాలను చేపడుతోంది. ఓటరు నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ, పారదర్శకతను పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. కాగా ఓటరు నమోదు ప్రక్రియ పత్రాల సమర్పణలకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాలనేదానిపై ఎన్నికల సంఘం ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
ఓటర్ల నమోదు, అర్హతలకు సంబంధించిన డాక్యుమెంట్ల సమర్పణపై భారత ఎన్నికల సంఘం (తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఓటర్లు ఏ సమయంలో పత్రాలు ఇవ్వాలి? ఏయే పత్రాలు చెల్లుబాటు అవుతాయి? అనే వివరాలను ప్రకటించింది.
డాక్యుమెంట్లు ఎప్పుడు సమర్పించాలి?
ఎన్యూమరేషన్ (Enumeration) దశలో: ఓటర్ల గణన లేదా ఎన్యూమరేషన్ ప్రక్రియ జరిగే సమయంలో ఓటరు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది.
నోటీసు ఇచ్చినప్పుడు మాత్రమే..
డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత… ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) , అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (AERO) ఎవరిదైనా అర్హతపై సందేహం వ్యక్తం చేస్తూ నోటీసు జారీ చేస్తే మాత్రమే, సదరు ఓటరు తన అర్హతను నిరూపించుకోవడానికి సపోర్టింగ్ డాక్యుమెంట్లను అందించాల్సి ఉంటుంది. ఓటరు అర్హత కోసం దాదాపు 12 రకాల పత్రాలను సమర్పించవచ్చని ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఒకవేళ అధికారులు నోటీసు ఇస్తే, ఓటర్లు తమ అర్హత నిరూపణ కోసం ఈ క్రింది 12 రకాల సపోర్టింగ్ డాక్యుమెంట్లలో దేనినైనా సమర్పించవచ్చు:
1) ఐడెంటిటీ కార్డ్ / పెన్షన్ పేమెంట్ ఆర్డర్: కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పీఎస్యూల ద్వారా రెగ్యులర్ ఉద్యోగులు/పెన్షనర్లకు జారీ చేసినవి.
2) ప్రభుత్వ గుర్తింపు పత్రాలు: 01.07.1987 కంటే ముందు భారతదేశంలో ప్రభుత్వం, స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీస్, ఎల్ఐసీ లేదా పీఎస్యూల ద్వారా జారీ చేయబడిన ఐడెంటిటీ కార్డ్/సర్టిఫికేట్/డాక్యుమెంట్.
3) జనన ధృవీకరణ పత్రం: సమర్థ అధికార యంత్రాంగం (Competent Authority) జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్.
4) పాస్పోర్ట్ (Passport).
5) విద్యా అర్హత పత్రాలు: గుర్తింపు పొందిన బోర్డులు లేదా యూనివర్సిటీలు జారీ చేసిన మెట్రిక్యులేషన్/ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్.
6) శాశ్వత నివాస ధృవీకరణ పత్రం: సమర్థ రాష్ట్ర అధికార యంత్రాంగం జారీ చేసిన పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్.
7) ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్ (అటవీ హక్కుల పత్రం).
8) కులం సర్టిఫికేట్: సమర్థ అధికారి జారీ చేసిన OBC / SC / ST లేదా ఏదైనా కాస్ట్ సర్టిఫికేట్.
9) నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC): (అమల్లో ఉన్నచోట).
10) ఫ్యామిలీ రిజిస్టర్: రాష్ట్ర లేదా స్థానిక సంస్థలు రూపొందించిన కుటుంబ రిజిస్టర్ ప్రతి.
11) భూమి/ఇంటి కేటాయింపు పత్రం: ప్రభుత్వం జారీ చేసిన ల్యాండ్/హౌస్ అలాట్మెంట్ సర్టిఫికేట్.
12) ఆధార్ కార్డ్: ఆధార్ సమర్పణకు సంబంధించి కమీషన్ జారీ చేసిన లెటర్.
ఓటర్లు ఎన్యూమరేషన్ సమయంలో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం కూడా లేదు, బీఎల్ఓ అధికారులు మీకు ఇచ్చిన పత్రాలలో వివరాలు నమోదు చేసి అందజేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు నోటీసు జారీ చేస్తే మాత్రమే పైన పేర్కొన్న పత్రాలను సిద్ధం చేసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
