బిజ్వార్–కొత్తపల్లి రహదారి పనులు పూర్తి చేయాలి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ నుంచి కొత్తపల్లి వరకు బీటీ రహదారి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ. కోటి 90 లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ పనులు రాష్ట్ర పాడి పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రారంభించారు. బీటీ రహదారి పనులు ప్రారంభమై సుమారు పది నెలలు గడిచిన పనులు అసంపూర్తిగా కొనసాగుతూ, కంకర వరకు మాత్రమే వేసి పనులను నిలిపివేశారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, విద్యార్థులు, రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దుమ్ము, గుంతలు, కంకర కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై కంకర వేసి ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి బిజ్వార్–కొత్తపల్లి బీటీ రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలి..
బిజ్వార్ నుండి కొత్తపల్లి బీటీ రోడ్డు పనులు ప్రారంభించి ఏడాది గడుస్తున్నా కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం వల్ల పనులు సక్రమంగా సాగడంలేదు. రోడ్డుపై కంకర వేయడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా బీటీ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషించారు. కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు సక్రమంగా చేపట్టాలని కారణంగా వర్షాకాలం ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారి పనులు పూర్తి చేయకపోతే ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఆర్. నర్సిములు, కొత్తపల్లి సర్పంచ్..
మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తాం…

ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ – కొత్తపల్లి బీటీ రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కు బిల్లులు రాని కారణంగా కాంట్రాక్టర్ పన్నుల్లో జాప్యం చేస్తున్నారు. పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించాం. పలుమార్లు మంత్రి వాకిటి శ్రీహరి బీటీ రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయిస్తాం.కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు మూడు నెలల్లో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుని ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
