సీఎం పర్యటన వేళ ముందస్తు అరెస్టులు..

మునుగోడు, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో మునుగోడు మండలంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ముందస్తు అరెస్టులు చేపట్టారు.

బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యువనేత జంగిలి నాగరాజును ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి కల్పించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి సభలో ప్లకార్డు ప్రదర్శించి నిరసన తెలిపే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది.