పీవీ సేవలు చిరస్మరణీయం..

భీంగల్, ఆంధ్రప్రభ: భీంగల్ పట్టణ కేంద్రంలో ఆదివారం మాజీ ప్రధానమంత్రి, భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి పి.వి. నరసింహారావు 105వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మల్లెల లక్ష్మణ్ మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు తన దూరదృష్టి, సమర్థ నాయకత్వంతో దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపిన మహానేత అని కొనియాడారు. ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టిన గొప్ప నాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై జన్మించిన పీవీ నరసింహారావు దేశానికి ప్రధానిగా సేవలందించడం ప్రతి తెలుగువారికి గర్వకారణమని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, మరియు కార్యకర్తలు పాల్గొని పీవీ నరసింహారావుకు ఘనంగా అంజలి ఘటించారు.