రైల్వే అండర్‌పాస్‌ల వద్ద రోడ్లు అధ్వానం..
వికారాబాద్, ఆంధ్రప్రభ: వికారాబాద్ జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో రైల్వే అండర్‌పాస్‌ల వద్ద రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో అండర్‌పాస్‌లలో నీరు నిల్వ ఉండటంతో గుంతలు కనిపించక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
వికారాబాద్ రైల్వే జంక్షన్ కావడంతో హైదరాబాద్–తాండూర్, జహీరాబాద్ మార్గాల్లో దాదాపు పది వరకు రైల్వే అండర్‌పాస్‌లు ఉన్నాయి. బూరుగుపల్లి, గొట్టిముకుల, గిరిరెడ్డిపల్లి, పులిమద్ది, గోవిందాపూర్ తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన మార్గాల్లో ఈ అండర్‌పాస్‌లు ఉండగా, వాటి వద్ద రహదారులు ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో రోజురోజుకూ రహదారుల పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది.
స్థానికుల కథనం ప్రకారం, దాదాపు పదేళ్లుగా అండర్‌పాస్‌ల వద్ద రహదారులకు శాశ్వత మరమ్మతులు చేపట్టలేదు. వర్షం కురిసినప్పుడల్లా నీరు నిలిచిపోవడంతో గుంతలు కనిపించక వాహనదారులు అదుపుతప్పి కిందపడుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ మార్గాల్లో ప్రయాణించడం మరింత ప్రమాదకరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజూ వందలాది మంది ఈ మార్గాల్లో ప్రయాణిస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైల్వే అండర్‌పాస్‌ల వద్ద దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
