28thJuneeditorial | అమెరికా మధ్యవర్తిత్వంలో శాంతి ఒప్పందం
28thJuneeditorial | అమెరికా మధ్యవర్తిత్వంలో శాంతి ఒప్పందం
28thJuneeditorial | హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఘర్షణల అసలు కారణాలు
లెబనాన్ భవిష్యత్తును నిర్ణయించే శాంతి ఒప్పందం
28thJuneeditorial | ఇజ్రాయెల్-లెబనాన్ల మధ్య కొన్ని నెలలుగా సాగుతున్న పోరాటానికి స్వస్తి చెప్పేందుకు అమెరికా ఆధ్వర్యంలో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం ఆహ్వానించదగిందే. అయితే, ఈ ఒప్పందం అమలు జరిగితేనే ఈ మూడు దేశాలకే కాకుండా, ఈ ప్రాంతానికి కూడా శాంతి చేకూరుతుంది. అమెరికా-ఇరాన్‌ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం కాగితాలకే పరిమితమైనట్టు ఇప్పటికే రుజువైంది. పరస్పర దాడులతో ఈ ఒప్పందాన్ని ఎవరూ గౌరవించకపోవడం హాస్యాస్పదంగా మారింది.
ఇప్పుడు ఇజ్రాయెల్-లెబనాన్ ఒప్పందం శాంతి సాధనకు ఒక ముందడుగు అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య ఏళ్ల తరబడి సాగిన సంఘర్షణకు ఈ ఒప్పందం ఒక ఆశ కల్పించవచ్చన్న ఆయన మాటల్లో ఎంతో నిజం ఉంది. ఇజ్రాయెల్ దుందుడుకు చర్యల వల్లే హెజ్బొల్లా మరింత రెచ్చిపోతోందన్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. అమెరికా అండ చూసుకుని ఇజ్రాయెల్ రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తోంది. ఇరాన్‌తో అమెరికా యుద్ధానికి కారణం కూడా ఇజ్రాయెల్ ఒత్తిడే.
లెబనాన్ మధ్యధరా బేసిన్, అరేబియా ద్వీపకల్పం కూడలిలో ఉంది. లెబనాన్ మానవ అభివృద్ధి సూచికలో 102వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా అవినీతి, 2020లో సంభవించిన పేలుళ్ల వల్ల లెబనాన్‌ను దిగువ మధ్య ఆదాయ దేశంగా వర్గీకరించారు. లెబనాన్‌లో ఆర్థిక పరిస్థితులే ఉగ్రవాదానికి బీజాలు వేశాయి. హెజ్బొల్లా తీవ్రవాదులు ఇక్కడి నుంచే ఇజ్రాయెల్‌పైనా, ఇతర దేశాలపైనా దాడులు జరుపుతున్నారు. హెజ్బొల్లాపై దాడుల కారణంగా ఇజ్రాయెల్ సంబంధిత దేశాలపై కూడా దాడులు జరుపుతోంది. లెబనాన్కీ, ఇజ్రాయెల్‌కీ మధ్య యుద్ధం చాలా కాలంగా సాగుతోంది. మతపరమైన విభేదాలే కాకుండా, అరబ్ ప్రపంచంతో లెబనాన్ సన్నిహితంగా ఉండటం వల్ల ఇజ్రాయెల్ కక్ష కట్టింది.
దీంతో హెజ్బొల్లా తీవ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించారు. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై పాలస్తీనా విమోచన సంస్థ దాడులు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ రెండింటి మధ్య ఘర్షణలను ఆసరాగా చేసుకుని అమెరికా మరింతగా పురికొల్పుతోంది. ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య ఇప్పుడు కుదిరిన శాంతి ఒప్పందం శాశ్వతంగా ఉంటుందా అనేది ప్రశ్న. గతంలో కూడా ఇలాంటి ఒప్పందాలు కుదిరాయి. ఇజ్రాయెల్ ఆక్రమణ వైఖరి కారణంగా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. లెబనాన్‌పై సిరియా అంతర్యుద్ధ ప్రభావం కూడా ఉంది. షియాలు, సున్నీల మధ్య ఘర్షణలను ఆసరాగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులను ప్రోత్సహించింది.
ఈ దాడుల వల్ల లెబనాన్‌లో 80 శాతం పైగా ప్రజలు పేదలుగా పరిగణించబడుతున్నట్టు ఐక్యరాజ్యసమితి గణాంకాలు తెలియజేస్తున్నాయి. తరచూ జరిగిన దాడులతో లెబనాన్‌లో జనాభాపై తీవ్రమైన ప్రభావం పడింది. దీర్ఘకాలం జరిగిన దోపిడీ ఫలితంగా లెబనాన్‌లో కొద్దిపాటి దేవదారు వృక్షాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. లెబనాన్‌లోని సహజ వనరులపై ఇటు అమెరికా, ఇజ్రాయెల్‌ల కన్ను పడింది. వాటి కారణంగానే తరచూ దాడులు జరుగుతున్నాయి. లెబనాన్‌లో తిరుగుబాటుదారులు పెరగడానికి విదేశీ దాడులే కారణం. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్‌ల ప్రమేయమే లెబనాన్‌ను అశాంతికి గురి చేస్తోంది. ఇప్పుడు కొత్తగా కుదిరిన ఒప్పందం వల్ల శాశ్వత శాంతి చిగురిస్తే లెబనాన్ భవిష్యత్తుకూ దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
