ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన..
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ..
ఆంధ్రప్రభ, భవానిపురం : పశ్చిమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి సుజనా ఫౌండేషన్ ద్వారా ప్రారంభించిన ఉచిత మెగా వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుంది. పశ్చిమ లోని పేద , మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని నిరంతరం ఉచితంగా అందించేందుకు నిపుణులైన వైద్యులతో పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేస్తున్నారు. ప్రజారోగ్య సంరక్షణే లక్ష్యంగా శనివారం బబ్బూరి గ్రౌండ్స్, కరకట్ట సౌత్ లో ప్రారంభించిన ఉచిత వైద్య శిబిరాన్ని పశ్చిమ ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకున్నారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన ఈ ఆరోగ్య శిబిరంలో పూర్తిగా ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, ఎక్స్ రే , వంటి పరీక్షలు నిర్వహించారు. జనరల్ మెడిసిన్,డెంటల్, కంటి పరీక్షలు, వంటి అనేక అనారోగ్యాలపై సుమారు 100 మందికి నిపుణులైన వైద్యుల బృందం ప్రత్యేక శ్రద్ధతో చికిత్సలు అందించారు. అవసరమైన వారికి అక్కడికక్కడే ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు.దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు పెద్ద ఉపశమనం లభించింది.
ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో , సుజనా ఫౌండేషన్ ద్వారా వారాంతంలో నిర్వహిస్తున్న ఈ మెగా వైద్య శిబిరాలను పేద, మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. పీ వీ ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ పీ వీ ఆర్, డాక్టర్ గురవయ్య, డాక్టర్ ప్రసాద్, శంకర నేత్ర చికిత్సలయం డాక్టర్ వీర్ల అంకమ్మ, డాక్టర్ సంధ్య ,గవర్నమెంట్ డెంటల్ డాక్టర్ ఆంజనేయులు మైనార్టీ నేత మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, 40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీ వీ చిన సుబ్బయ్య, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు ఈ శిబిరం లో వైద్య సేవలు అందించారు..
