అమ్మవారి సేవలో యువతకు అవకాశం ఇవ్వాలి..
ఇంద్రకీలాద్రి పాలనలో తీసుకోవాలి…
పదవీ విరమణ అధికారుల పొడిగింపు ఒద్దు..
కొత్త నియామకాలపై దృష్టి సాధించాలి..
యువ, అర్హత కలిగిన అధికారులకు అవకాశం కల్పించాలి
పారదర్శక, సమర్థవంతమైన పరిపాలన కోసం కొత్త నియామకాలు చేయాలి
ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి సభ్యులు..
ఈవోను కలిసి వినతిపత్రం సమర్పించిన పరిరక్షణ సమితి సభ్యులు
ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడ లోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన పరిపాలనలో పదవీ విరమణ పొందిన అధికారులకు పదవీకాలం పొడిగింపులు ఇవ్వడం సముచితం కాదని ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి స్పష్టం చేసింది. దేవస్థానంలో పరిపాలనా వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దాలంటే కొత్త ఆలోచనలు కలిగిన యువ అధికారులకు అవకాశాలు కల్పించడం అవసరమని కమిటీ అభిప్రాయపడింది.
శుక్రవారం దేవస్థాన కార్యనిర్వాహణాధికారి వి కే శీను నాయక్ ని కలిసిన పరిరక్షణ సమితి సభ్యులు ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు. పదవీ విరమణ పొందిన అధికారులకు వరుసగా పొడిగింపులు ఇవ్వడం వల్ల కొత్తగా అర్హత కలిగిన అధికారులకు అవకాశాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంటోందని వారు ఈ సందర్భంగా వివరించారు. దేవస్థాన పరిపాలనలో బాధ్యతాయుత సేవలు, పారదర్శకత, వేగవంతమైన నిర్ణయాలు, ఆధునిక నిర్వహణ విధానాల కోసం యువ అధికారుల అవసరం అత్యంత కీలకమని సమితి సభ్యులు పేర్కొన్నారు.
ఒకే వ్యక్తులకు పదేపదే పొడిగింపులు ఇవ్వడం పరిపాలనా వ్యవస్థలో సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ఆవుటపల్లి శివప్రసాద్, సభ్యులు పొదిలి సుజాత, ఆవుటుపల్లి కృష్ణకుమారి, పొనుగోటి సునీత పాల్గొన్నారు. దేవస్థాన అభివృద్ధి, భక్తుల సేవల మెరుగుదల కోసం నూతన దృష్టికోణం అవసరమని వారు ఈ సందర్భంగా సూచించారు. దేవస్థాన పరిపాలనలో సమతుల్యత, నైపుణ్యం, ఆధునిక విధానాలను అమలు చేస్తే సేవల నాణ్యత మరింత మెరుగవుతుందని పరిరక్షణ సమితి అభిప్రాయపడింది.
