అందరి సహకారంతో సమస్యల పరిష్కారం..
- నూతన ఎంపీడీవో రవీందర్ కు సన్మానం
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండల నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్‌ను శనివారం పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
జైనూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంతరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తొడం ధర్మారావు, ఇతర నాయకులు ఎంపీడీవోను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు ప్రజా సమస్యలపై ఆయనతో చర్చించారు.
అనంతరం ఎంపీడీవో రవీందర్ మాట్లాడుతూ, మండలంలో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు అర్క నాగోరావు, కోవ నాందేవ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
