weight loss | కొవ్వు కరగడం పక్కా! కానీ ఇలా చేస్తేనే..

weight loss | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: ఉదయం 8 గంటలకు ఓ గ్లాస్ మంచి నీళ్లు తాగడం.. ఆఫీస్‌కు వెళ్లాక మధ్యాహ్నం లంచ్ టైమ్ అయినా ఆకలిని తట్టుకుని ఎదురుచూడటం.. సాయంత్రం ఇంటికి వచ్చాక పరిమిత స్థాయిలో ఆహారం తీసుకోవడం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అనుసరిస్తున్న ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ (Intermittent Fasting) విధానం ఇది. బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఇప్పుడు ఇది ఒక ఆరోగ్య మంత్రంగా మారిపోయింది.

కానీ, ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది అందరికీ సరిపోదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల ఎంత లాభం ఉందో, అంతే నష్టం కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు. అసలు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల నిజంగానే బరువు తగ్గుతారా? ఇలా ఆకలిని చంపుకుని ఒకేసారి భోజనం చేయడం మంచిదేనా? ఈ ఫాస్టింగ్ ఎలా చేయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి?
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. మన దేశంలో మాత్రం ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు తాము బరువు తగ్గడానికి, ఫిట్‌గా కనిపించడానికి దీన్ని అనుసరిస్తున్నామని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించడంతో ఇది బాగా ప్రాచుర్యం పొందింది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ప్రత్యేకమైన డైట్ కాదు. ఇది “ఎప్పుడు తినాలి? ఎంత సమయం ఉపవాసం ఉండాలి?” అని చెప్పే ఒక ఆహార విధానం. ఈ పద్ధతిలో కొన్ని గంటల పాటు ఉపవాసం ఉండి, మిగిలిన కొన్ని గంటల వ్యవధిలో సమయానుసారంగా ఆహారం తీసుకుంటారు.

ఇందులోనూ నాలుగు రకాల పద్ధతులు ఉన్నాయండోయ్‌ బాబూ..
1) 16ః 8 రోజుకు 16 గంటలు ఉపవాసం ఉండి 8 గంటలు ఆహారం తీసుకోవడం ( ఇది ఇప్పుడు అందరూ అనుసరిస్తున్న పద్ధతి)
2) 14ః10 రోజుకు 14 గంటలు ఉపవాసం ఉండి 10 గంటలు ఆహారం తీసుకోవ డం ( ఇది ప్రారంభఢ దశలో ఉన్నా వారికి అనువైనది)
3) 5ః2 వారం మొత్తంలో 5 సాధరణ ఆహారం తీసుకోని మిగిలిన రెండు రోజులు తక్కువ క్యాలరీతో ఆహారం తీసుకోవడం.
4) ఈట్‌ – స్టాప్‌ – ఈట్‌ వారంలో 1 లేదా 2 రోజులు ఆహారం తీసుకొకుండా ఉపవాసం ఉండటం.

ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ వల్ల కలిగే ప్రయోజనాలు..

1) బరువుతగ్గడం..
ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ పాటించడంలో ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో ఇన్సులిన్‌ స్థాయి తగ్గి శరీరంలో ఉన్నా కొవ్వు నిల్వలు క్రమంగా శరీరం ఉపయోగించుకోవడం వలన బరువు తగ్గడానికి చాలా తెలిక. అంతే కాదు రోజంతా మనం తీపుకునే ఆహారం తగ్గడంలో మనం శరీరానికి క్యాలరీను కూడా తక్కువగా అందిస్తాం..

  1. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది..

కొన్ని పరిశోధనల్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఇన్సులిన్ పనితీరు మెరుగుపడినట్లు గుర్తించారు. ఇది టైప్-2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో కొంతమేర సహాయపడవచ్చు. అయితే మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా దీన్ని ప్రారంభించకూడదు.

  1. శరీర కణాల పునరుద్ధరణ..

ఉపవాస సమయంలో శరీరంలో ఆటోఫాజీ (అనే సహజ ప్రక్రియ చురుకుగా మారుతుంది. ఇందులో దెబ్బతిన్న కణాలు తొలగిపోయి కొత్త కణాల ఏర్పాటుకు సహకారం లభిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

  1. గుండె ఆరోగ్యానికి మేలు..

కొన్ని అధ్యయనాల ప్రకారం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ తగ్గే అవకాశం ఉంది. దీంతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గవచ్చని భావిస్తున్నారు.

మరికొన్ని ప్రయోజనాలు..

  • కొన్ని పరిశోధనల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరు మెరుగుపడినట్లు గుర్తించారు. అయితే దీనిపై మరింత పరిశోధన అవసరమని నిపుణులు చెబుతున్నారు.
  • దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్ అనేక వ్యాధులకు కారణమవుతుంది. కొన్ని అధ్యయనాల్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గే సూచనలు కనిపించాయి.
  • రోజంతా తరచుగా తినకుండా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు కొంత విశ్రాంతి లభిస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల వచ్చే నష్టాలు…
  1. ప్రారంభంలో ఆకలి ఎక్కువగా వేయడం, తలనొప్పి, అలసట, చిరాకు వంటి సమస్యలు కనిపించవచ్చు.
  2. తగిన పోషకాహారం తీసుకోకపోతే నీరసం, తల తిరగడం, శక్తి తగ్గడం వంటి సమస్యలు రావచ్చు.
  3. ఉపవాసం ముగిసిన తర్వాత ఒకేసారి అధికంగా తినడం వల్ల బరువు తగ్గే బదులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
  4. ప్రోటీన్ తక్కువగా తీసుకుంటే శరీరం కండరాలను కూడా శక్తి కోసం వినియోగించే అవకాశం ఉంటుంది.
  5. మధుమేహం ఉన్నవారిలో షుగర్ ఒక్కసారిగా తగ్గే ప్రమాదం ఉంటుంది.
  6. కొంతమందిలో ఆహార సమయాలు మారడం వల్ల నిద్రలేమి లేదా నిద్ర నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది.
  7. మహిళల్లో దీర్ఘకాలం కఠినమైన ఫాస్టింగ్ చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఎవరెవరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు?

గర్భిణులు, పాలిచ్చే తల్లులు , 18 సంవత్సరాల లోపు పిల్లలు, తీవ్రమైన మధుమేహం ఉన్నవారు, తరచుగాలో బీపీ వచ్చే వారు, ఆహార సంబంధిత రుగ్మతలు (Eating Disorders) ఉన్నవారు, తీవ్రమైన కాలేయం లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కి దూరంగా ఉండటం మంచిది.

ఫాస్టింగ్ సమయంలో ఏం తినాలి?

పండ్లు, కూరగాయలు, గుడ్లు, పప్పులు, నట్స్ , పెరుగు, చేపలు, చికెన్ (తక్కువ నూనెతో), తగినంత ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం

ఉపవాస సమయంలో ఏం తాగొచ్చు?

నీరు, నిమ్మరసం (చక్కెర లేకుండా), గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ (చక్కెర లేకుండా), బ్లాక్ టీ

ఎలాంటి తప్పులు చేయకూడదు?

-ఉపవాసం తర్వాత ఒకేసారి ఎక్కువ తినకండి.
-తగినంత నీరు తాగండి.
-జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి.
-తగినంత నిద్రపోవాలి.
-వ్యాయామం మితంగా చేయాలి.
-శరీరం ఇచ్చే సంకేతాలను గమనించాలి.

నిపుణులు సలహా..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సమతుల ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రాధాన్యం ఇస్తుంది. అలాగే హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్, క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ వంటి సంస్థలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కొందరికి ఉపయోగపడవచ్చని, అయితే దీర్ఘకాల ప్రభావాలపై ఇంకా మరిన్ని పరిశోధనలు అవసరమని పేర్కొంటున్నాయి. అందువల్ల ఇది అందరికీ సరిపోయే విధానం కాదని, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నాయి.

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కొందరికి బరువు తగ్గడం, మెటబాలిక్ ఆరోగ్యం మెరుగుపడటంలో సహాయపడవచ్చు. కానీ ఇది అందరికీ ఒకే విధంగా పనిచేసే మంత్రం కాదు. వయస్సు, ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి, ఆహారపు అలవాట్లను బట్టి ఫలితాలు మారుతాయి. అందుకే ఈ విధానాన్ని ప్రారంభించే ముందు వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.