కంటైనర్ బోల్తా

అదుపుతప్పి పల్టీ కొట్టిన భారీ వాహనం

జనసంచారం లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ఫ్లైఓవర్‌పై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గాజువాక నుంచి విశాఖ సిటీ వైపు వెళ్తున్న ఓ భారీ కంటైనర్ ఫ్లైఓవర్‌పైకి చేరుకున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే కంటైనర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపైనే పల్టీ కొట్టడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను మళ్లిస్తూ సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైఓవర్‌పై జనసంచారం, వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశంగా మారింది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కంటైనర్‌ను తొలగించి ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు.