మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన

  • కమ్మర్‌పల్లి ఎస్‌ఐ సీహెచ్. సతీష్

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని కమ్మర్‌పల్లి ఎస్‌ఐ సీహెచ్. సతీష్ అన్నారు.బుధవారం కమ్మర్‌పల్లి పోలీసు శాఖ ఆధ్వర్యంలో మండలంలోని ఉప్లూర్ గ్రామ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ సతీష్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. గంజాయి, మాదకద్రవ్యాలు మరియు ఇతర మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యం, విద్యాభ్యాసం, కుటుంబ జీవితం, సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించారు.విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, మంచి లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. అలాగే మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసు శాఖకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండటమే వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు.అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మత్తు పదార్థాల పట్ల జాగ్రత్తలు, చైతన్యం పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని ఎస్‌ఐ సతీష్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.