Road Accident | తిరుపతి జిల్లాలో విషాదం

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తిరుపతి జిల్లా పాకాల మండలంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. గాదంకి గ్రామ సమీపంలోని ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారు.

పోలీసుల వివరాల ప్రకారం… యాదమర్రి ప్రాంతానికి చెందిన కొందరు గ్రామస్తులు ఆటోలో ప్రయాణిస్తున్నారు. గాదంకి ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఆటో బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయ్యింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో నలుగురు తీవ్ర గాయాలతో బయటపడగా, స్థానికులు మరియు పోలీసులు వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి ఆటో అతివేగమే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది.