CM Revanth | కప్పం కట్టకపోతే.. సీఎం పోస్ట్ ఊస్ట్

CM Revanth | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, ‘రెన్యువల్ సీఎం’ అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు.

సత్తుపల్లి పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి దెబ్బతింటుందని కేసీఆర్ ముందే హెచ్చరించారని, ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ఓటమితో రాష్ట్రం నష్టపోయిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని, ఇప్పటివరకు 72 సార్లు వెళ్లి రాష్ట్రానికి ఏమి సాధించారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కల్లూరు మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ గెలిచే అవకాశం ఉందని, సత్తుపల్లిలో కూడా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి ఎదురైందని కేటీఆర్ పేర్కొన్నారు. గెలిచినా అతిగా సంబరాలు చేసుకోవద్దని, ఓడినా నిరాశ చెందవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు.

తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లినా కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోందని, మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులు వేశామని తెలిపారు.

రైతుల రుణమాఫీ పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలోనూ హామీలను నెరవేర్చలేకపోయిందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.