ముగిసిన మూడో విడత అడ్మిషన్ల ప్రక్రియ..

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : తెలంగాణలోని బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పీయూసీ మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ మంగళవారంతో ముగిసినట్లు యూనివర్సిటీ పీఆర్వో బాలకృష్ణ తెలిపారు.

మూడో విడత కౌన్సెలింగ్‌లో 159 మంది విద్యార్థులకు అడ్మిషన్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మొదటి విద్యార్థికి ప్రవేశ పత్రాన్ని యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్ గోవర్ధన్ అందజేశారు.

ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ, యూనివర్సిటీలో విద్యార్థుల కోసం సెల్‌ఫోన్ వినియోగంపై నిషేధం అమలులో ఉన్నట్లు తెలిపారు. తరగతి గదులు, గ్రంథాలయం (లైబ్రరీ), మెస్ తదితర ప్రాంతాల్లో ఈ నిబంధన అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

విద్యార్థుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ నిబంధనలను గమనించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.