రుచి, శుచితో కూడిన భోజనం అందించాలి
మధ్యాహ్న భోజన నాణ్యతపై ఎంఈఓ సాంబశివరావు సూచనలు
శావల్యాపురం, ఆంధ్రప్రభ: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఎండీఎం నిర్వాహకులు రుచికరమైన, పరిశుభ్రమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఎంఈఓ మద్దికుంట సాంబశివరావు అన్నారు.
సాధారణ తనిఖీల్లో భాగంగా మండలంలోని తుమ్మలకుంట, పొట్లూరు ప్రాథమిక పాఠశాలలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు.
విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి పాఠ్యాంశాలను చదివించి, గ్రీన్‌బోర్డుపై రాయించారు. సామర్థ్యం తక్కువగా ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అనంతరం మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి భుజించి, భోజన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పొట్లూరు ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్‌కే షరీఫ్, తుమ్మలకుంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజా రమేష్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
