వెస్ట్ సిటీ కాలనీలకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్..

  • ఓవర్‌లోడ్ సమస్యకు చెక్

కాజీపేట, ఆంధ్రప్రభ : కాజీపేట పట్టణంలోని బాపూజీనగర్ పరిధిలోని వెస్ట్ సిటీ కాలనీల్లో నెలకొన్న విద్యుత్ ఓవర్‌లోడ్ సమస్య పరిష్కారానికి విద్యుత్ శాఖ కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసింది.

కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యను కాజీపేట ఏఈ చందులాల్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించి ఉన్నతాధికారులకు నివేదించారు. అనంతరం కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరై, హనుమకొండ ఎస్‌ఈ సాంబ నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఈ సాంబ నాయక్ మాట్లాడుతూ, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు వల్ల ఓవర్‌లోడ్ సమస్య పూర్తిగా తగ్గి విద్యుత్ సరఫరా మరింత సాఫీగా సాగుతుందని తెలిపారు. వినియోగదారులకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు శాఖ కట్టుబడి ఉందన్నారు.

కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుతో తమ సమస్య పరిష్కారమైందని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ టి. దక్షిణామూర్తి, ఏడీఈ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ చందులాల్, విద్యుత్ శాఖ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.