Rare Fish Auction | హార్బర్‌లో సందడి చేసిన ‘కచిడి’
Rare Fish Auction | హార్బర్‌లో సందడి చేసిన ‘కచిడి’
Rare Fish Auction | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మత్స్యకారులకు అరుదైన అదృష్టం కలిసొచ్చింది. అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు 25 కిలోల బరువున్న అరుదైన ‘కచిడి’ చేప చిక్కింది. సాధారణంగా సముద్రంలో అరుదుగా లభించే ఈ చేపకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉండటంతో వేలంలో ఏకంగా రూ.2 లక్షల ధర పలికింది.
చేపల వేట ముగించుకుని హార్బర్‌కు చేరుకున్న మత్స్యకారులు వలలో భారీ పరిమాణంలో ఉన్న కచిడి చేపను చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయం క్షణాల్లో పరిసర ప్రాంతాలకు వ్యాపించడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో హార్బర్‌కు చేరుకుని చేపను తిలకించారు.
కచిడి చేపలోని కొన్ని భాగాలు ఔషధాల తయారీలో ఉపయోగపడతాయని, ముఖ్యంగా అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు ఈ జాతి చేపలకు అధిక ధర చెల్లిస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో వేలం పాటలో ఈ చేపకు మంచి పోటీ నెలకొంది.
చివరకు పాలకొల్లుకు చెందిన ఓ వ్యాపారి ఈ అరుదైన చేపను రూ.2 లక్షలకు కొనుగోలు చేశారు. ఒక్క చేపతోనే లక్షల రూపాయల ఆదాయం రావడంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇటీవలి కాలంలో కోనసీమ తీర ప్రాంతాల్లో ఇలాంటి అరుదైన చేపలు అప్పుడప్పుడు చిక్కుతున్నప్పటికీ, ఈ స్థాయిలో ధర పలకడం విశేషంగా మారింది.
