పేరేపల్లి వద్ద కెమికల్ లీక్ కలకలం
పేరేపల్లి వద్ద కెమికల్ లీక్ కలకలం
అస్వస్థతకు గురైన రైతులు, విద్యార్థులు
ఫార్మా కంపెనీల నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తుల ఆరోపణ
చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల మండలం పేరేపల్లి గ్రామ పరిధిలోని వియాస్ ఫార్మా కంపెనీ నుంచి మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు రసాయన వాయువు లీక్ కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కెమికల్ దుర్వాసన వ్యాపించడంతో పేరేపల్లి, వెలిమినేడు గ్రామాలకు వెళ్లే మార్గాల్లో సంచరిస్తున్న రైతులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.
ఉదయం పొలాలకు వెళ్తున్న రైతులు, పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు బయలుదేరిన వారు, పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు రసాయన వాయువు ప్రభావంతో కళ్ల మంటలు, తలనొప్పి, తల తిరగడం, వాంతులు వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. అస్వస్థతకు గురైన వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
ఫార్మా కంపెనీ నుంచి వెలువడే కాలుష్యం, రసాయనాల నిర్వహణలో యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భద్రతా ప్రమాణాలను సక్రమంగా పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
రసాయన పరిశ్రమల నిర్లక్ష్యంతో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని, ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు స్పందించి నామమాత్రపు చర్యలకే పరిమితమవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. పరిశ్రమలపై కఠిన పర్యవేక్షణ చేపట్టి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తూ, కెమికల్ లీక్‌కు గల కారణాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం.
