కరుణించిన వరుణుడు.. ఊపిరి పీల్చుకున్న అన్నదాతలు

జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఖరీఫ్ పనులకు శ్రీకారం

పెద్దపల్లి, ఆంధ్రప్రభ: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి దాదాపు పక్షం రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఆందోళన చెందుతున్న రైతులకు వరుణుడు ఊరటనిచ్చాడు. మంగళవారం తెల్లవారుజామున నుంచి పెద్దపల్లి జిల్లాలోని అన్ని మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు.

జిల్లావ్యాప్తంగా సగటున 71.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కమాన్‌పూర్ మండలంలో 116.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా జూలపల్లి మండలంలో 27.8 మిల్లీమీటర్లు నమోదైంది. జిల్లా కేంద్రం పెద్దపల్లిలో 73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

కొన్ని రోజులుగా వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ సాగుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు తాజా వర్షాలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురవడంతో పొలాల్లో దుక్కి పనులు, విత్తనాల విత్తకం, ఇతర ఖరీఫ్ వ్యవసాయ పనులు వేగం పుంజుకున్నాయి.

వ్యవసాయానికి అనుకూలంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాల మట్టాలు పెరిగే అవకాశం ఉందని, చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుండటంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.