విశాఖ ఫార్మా సిటీ అగ్నిప్రమాదం బాధాకరం: వైఎస్ జగన్

విశాఖ ఫార్మా సిటీ అగ్నిప్రమాదం బాధాకరం: వైఎస్ జగన్

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి

ఆంధ్రప్రభ, విశాఖపట్నం బ్యూరో: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

పరవాడలోని ఫార్మా సిటీలో ఉన్న దక్షిణ్ ఎనర్జీ సంస్థలో సంభవించిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని కోరారు.

అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ కోరారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను సమగ్రంగా విచారించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.