TamilNadu | శభాష్ సీఎం విజయ్..!

TamilNadu | శభాష్ సీఎం విజయ్..!

పైసా లంచం లేకుండానే భవన అనుమతులు
తమిళనాడులో కొత్త పాలన.. లంచం అంటే ‘నో’
అనుమతుల కోసం చేతులు తడపాల్సిన పనిలేదు!

TamilNadu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ కార్యాలయాల్లో పని జరగాలంటే లంచం తప్పదనే భావన చాలా మందిలో ఇప్పటికీ ఉంది. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ ఆమోదాలు, వాణిజ్య సముదాయాలకు అనుమతులు వంటి అంశాల్లో అధికారులు, మధ్యవర్తుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. అయితే తమిళనాడులో ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొంటున్నాయని నిర్మాణ రంగ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నాయకత్వంలో ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత పెరిగిందని, భవన అనుమతుల ప్రక్రియ గతంతో పోలిస్తే మరింత వేగవంతం, సులభతరం అయిందని వారు అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడులో భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే బిల్డర్లు, డెవలపర్లు ఇప్పుడు ఆశ్చర్యానికి గురవుతున్నారట. గతంలో సాధారణంగా కనిపించే ఆలస్యాలు, అనవసర అడ్డంకులు, అధికారిక ప్రక్రియలకు అతీతంగా జరిగే వ్యవహారాలు గణనీయంగా తగ్గాయని వారు చెబుతున్నారు. అంతేకాకుండా కొందరు పాత పద్ధతుల్లో వ్యవహరించాలని ప్రయత్నించినా, అధికారులు అలాంటి ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నారని నిర్మాణ రంగ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం భవన అనుమతుల జారీ ప్రక్రియను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టింది. ముఖ్యంగా చెన్నై మహానగర ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాలకు సంబంధించిన అనుమతుల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించింది. దీనివల్ల దరఖాస్తుల పరిశీలన, ఆమోద ప్రక్రియలో వేగం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. సాంకేతిక ప్రమాణాలు, భద్రతా నిబంధనలను పాటిస్తూ అనుమతులు మంజూరు చేసే విధానంలో స్పష్టత పెరగడంతో నిర్మాణ రంగానికి ఊతం లభిస్తున్నట్లు తెలుస్తోంది.

నిర్మాణ రంగ అభివృద్ధికి అనుమతుల ప్రక్రియ కీలకమని నిపుణులు చెబుతున్నారు. అనవసర జాప్యాలు తగ్గితే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. పెట్టుబడులు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పరిశ్రమకు అనుకూలంగా ఉన్నాయని రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులు కూడా ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నారు. డెవలపర్లు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుంటూ, అనుమతుల వ్యవస్థను మరింత సరళీకరించే దిశగా చర్యలు తీసుకోవడం అభినందనీయమని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత పెరగడం వల్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని అంటున్నారు.

ప్రభుత్వ సేవలు వేగంగా, అవినీతి రహితంగా అందితే అభివృద్ధి మరింత వేగం అందుకుంటుందనే అభిప్రాయం బలపడుతోంది. తమిళనాడులో ప్రస్తుతం కనిపిస్తున్న మార్పులు పరిపాలనా సంస్కరణలకు ఒక ఉదాహరణగా నిలుస్తున్నాయని నిర్మాణ రంగ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించడం, పారదర్శక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా అభివృద్ధికి కొత్త దిశ చూపుతున్నామని ప్రభుత్వం చెబుతోంది.