Consumer Panel Fines BookMyShow | షో రద్దయినా సమాచారం ఇవ్వలేదు.. బుక్‌మైషోకు రూ.12 వేల జరిమానా

Consumer Panel Fines BookMyShow | షో రద్దయినా సమాచారం ఇవ్వలేదు.. బుక్‌మైషోకు రూ.12 వేల జరిమానా

Consumer Panel Fines BookMyShow | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ బుక్ చేసుకున్న వినియోగదారుడికి షో రద్దు విషయాన్ని ముందస్తుగా తెలియజేయకపోవడంతో ప్రముఖ టికెటింగ్ వేదిక బుక్‌మైషోకు వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. వినియోగదారుడికి కలిగిన అసౌకర్యానికి గాను రూ.10,000 పరిహారం, రూ.2,000 న్యాయ వ్యయాలు చెల్లించాలని ఆదేశించింది.

అసలు ఏం జరిగింది?
కూకట్‌పల్లికి చెందిన నారాయణన్ కుట్టిగోపాలకృష్ణన్ అనే వ్యక్తి 2025 జనవరి 1న మలయాళ ఫాంటసీ సినిమా బరోజ్ చిత్రం కోసం లులూ మాల్‌లోని సినీపోలిస్ మల్టీప్లెక్స్‌లో టికెట్‌ను బుక్‌మైషో యాప్ ద్వారా బుక్ చేసుకున్నారు.

అయితే, థియేటర్‌కు చేరుకున్న తర్వాత ఆ షో రద్దయిందని, దాని స్థానంలో మరో సినిమా ప్రదర్శిస్తున్నట్లు ఆయన గుర్తించారు. షో రద్దు గురించి బుక్‌మైషో గానీ, థియేటర్ యాజమాన్యం గానీ ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో తాను అనవసరంగా థియేటర్ వరకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొంటూ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

బుక్‌మైషో వాదన ఇదే..
విచారణ సందర్భంగా బుక్‌మైషో తరఫు న్యాయవాదులు, తమ సంస్థ కేవలం వినియోగదారులు మరియు థియేటర్ల మధ్య మధ్యవర్తిగా మాత్రమే పనిచేస్తుందని వాదించారు. సినిమా ప్రదర్శనలు, షో టైమింగ్స్, రద్దులు, షెడ్యూల్ మార్పులు వంటి అంశాలు పూర్తిగా థియేటర్ యాజమాన్యం పరిధిలోనే ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ఫిర్యాదు వచ్చిన మరుసటి రోజే రూ.207.14 విలువైన టికెట్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించినట్లు కమిషన్‌కు వివరించారు.

కమిషన్ ఏమన్నది?

రెండు వర్గాల వాదనలు విన్న అనంతరం వినియోగదారుల కమిషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకసారి టికెట్ బుకింగ్ ప్రక్రియలో భాగమైన తర్వాత, షో రద్దు వంటి ముఖ్యమైన సమాచారాన్ని వినియోగదారులకు చేరవేయాల్సిన బాధ్యత టికెటింగ్ వేదికపై కూడా ఉంటుందని స్పష్టం చేసింది. షో రద్దు విషయాన్ని తెలియజేయకుండా వినియోగదారుడు థియేటర్ వరకు వెళ్లే పరిస్థితి కల్పించడం సేవల్లో లోపం కిందకే వస్తుందని కమిషన్ అభిప్రాయపడింది. వినియోగదారుడికి కలిగిన అసౌకర్యం, సమయం వృథా అయినందుకు బుక్‌మైషో రూ.10,000 పరిహారం చెల్లించాలని, అదనంగా రూ.2,000 న్యాయ ఖర్చుల కింద చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.