భారత మహిళల జట్టుకు భారీ షాక్
- గాయంతో మైదానం వీడిన శ్రేయాంక పాటిల్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : మహిళల టీ20 ప్రపంచకప్-2026లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత మహిళల జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆఫ్‌స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తీవ్ర గాయానికి గురై స్ట్రెచర్‌పై మైదానం వీడాల్సి వచ్చింది. ఆమె కుడి కాలికి గాయమైనట్లు ప్రాథమిక సమాచారం. గాయం తీవ్రతపై స్కానింగ్ నివేదిక కోసం జట్టు యాజమాన్యం ఎదురుచూస్తోంది.
శ్రేయాంక పాటిల్‌కు గత రెండేళ్లు గాయాలతోనే గడిచాయి. 2024 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా వేలికి ఫ్రాక్చర్ కావడంతో ఆమె కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత రెండు కాళ్లలో తీవ్రమైన షిన్ స్ప్లింట్స్, మణికట్టు గాయం, ఎడమ బొటనవేలి ఫ్రాక్చర్‌తో దాదాపు 14-16 నెలలు క్రికెట్‌కు దూరమైంది. 2025 మహిళల ప్రీమియర్ లీగ్, స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లను కూడా కోల్పోయింది.
అయితే 2026 డబ్ల్యూపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 9 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి సత్తా చాటింది శ్రేయింక. అందులో 5/23 అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది. అదే ప్రదర్శనతో ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకుంది.
గాయం ఎలా జరిగింది?
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యాటర్ ఫీబే మోల్కెన్‌బోర్ ఆడిన బంతిని ఆపేందుకు శ్రేయాంక పరుగెత్తింది. బంతిని అందుకునే క్రమంలో ఆమె కుడికాలు బంతిపై పడటంతో చీలమండ (Ankle) బెనికింది. దాంతో తీవ్ర నొప్పితో మైదానంలోనే కుప్పకూలిపోయింది శ్రేయాంక. సహచర ఆటగాళ్లు, ఫిజియో వెంటనే ఆమె వద్దకు చేరుకున్నారు. కాలి మీద బరువు పెట్టలేని పరిస్థితిలో శ్రేయాంక ఉండటంతో స్ట్రెచర్‌పై గ్రౌండ్ బయటకు తీసుకెళ్లారు.
బీసీసీఐ రియాక్షన్..
శ్రేయాంక పాటిల్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిందని, ఆమెను స్ట్రెచర్‌పై మైదానం నుంచి తరలించామని బీసీసీఐ మహిళల విభాగం అధికారిక ప్రకటనలో తెలిపింది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది..
గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే శ్రేయాంక ప్రపంచకప్ మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆమె స్థానంలో ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉన్న ఎడమచేతి స్పిన్నర్ తనూజ కన్వర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ భారతి ఫుల్మాలి, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సైమా ఠాకూర్ కూడా ప్రత్యామ్నాయాలుగా అందుబాటులో ఉన్నారు. స్కాన్ నివేదిక వచ్చిన తర్వాతే శ్రేయాంక భవితవ్యంపై స్పష్టత రానుంది.
